
హాంకాంగ్: హాంకాంగ్‌లో విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. రూ. 9 లక్షల డిన్నర్ బిల్లుతో పాటు‘డేట్’ను కూడా అక్కడే వదిలి వెళ్లిన హాంకాంగ్ ‘లాయర్’ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్‌లో న్యాయవాదిగా చలామణీ అవుతూ, లగ్జరీ డిన్నర్‌కు భారీగా ఆర్డర్ ఇచ్చి, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టడమే కాకుండా, డేట్‌ను కూడా అక్కడే వదిలి వెళ్లిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అతనితో డేట్‌కు వచ్చిన యువతి అతని పేరు వాంగ్ అని మాత్రమే తెలుసని పోలీసులకు వివరించింది. తనను ఒక విలాసవంతమైన రెస్టారెంట్‌లో వదిలివేసి, 80 వేల అమెరికన్ డాలర్లు (రూ.9 లక్షలు) చెల్లించకుండా వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంలో పోలీసులు వాంగ్‌ను ట్సుంగ్ క్వాన్ ఓలో అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో అతను ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘ది స్టాండర్డ్’ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ యూనిట్ దర్యాప్తులో ఉన్నాడు. సెంట్రల్‌లోని మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో విందు కోసం ఒక యువతిని డేట్ కు వాంగ్ ఆహ్వానించాడు. ఆ సమయంలో వాంగ్ ఆమెకు తాను న్యాయవాదినని పరిచయం చేసుకున్నాడు. డిన్నర్ సమయంలో వారు అత్యంత ఖరీదైన షాంపైన్ బాటిల్‌ను ఆర్డర్ చేశారు. మొత్తం బిల్లు రూ. 9లక్షలకు పైగానే వచ్చింది.
అయితే, ఆ బిల్లు చెల్లించే సమయానికి ‘న్యాయవాది’ వాష్‌రూమ్‌కు వెళ్లాలని ‘డేట్’కు చెప్పి, అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆమె ఫోనులో అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. తరువాత ఆమె స్నేహితుల సహాయం కోరగా, వారు డిన్నర్ బిల్లు చెల్లించారు. ‘డేట్’ బాధితురాలి ఫిర్యాదు దరిమిలా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.