
హెచ్–1బీకి మొదట్లో మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్
వాషింగ్టన్: నూతన హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూలాలున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతంలో చేసిన హెచ్–1బీ అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు మరోసారి తెరమీదకొచ్చాయి. హెచ్–1బీ కారణంగానే తనలాంటి ఎంతో మంది దక్షిణాఫ్రికా మొదలు ఎన్నో ప్రపంచదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, హెచ్–1బీ అనేది అద్భుతమైన విధానమని గతంలో మస్క్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేసిన అంశాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
ఆ తర్వాతి కాలంలో హెచ్–1బీ విధానంపై మస్క్ హఠాత్తుగా మాటమార్చారు. అది అత్యంత లోపభూయిష్టమైన విధానమని, అమెరికాకు దీంతో ప్రయోజనంలేదని అభాండాలు వేయడం మొదలెట్టడం చూసి రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేయడం తెల్సిందే. మొదట్లో ట్రంప్‌ను ఆకాశానికెత్తేసిన మస్క్ ఆ తర్వాత ట్రంప్‌కు పోటీగా రాజకీయ పార్టీని సైతం ప్రకటించారు. హెచ్–1బీ అమలుతీరులో ఎలాంటి లోపాలు లేవు. సంస్కరణలు అక్కర్లేదని మస్క్ గతంలో అన్నారు. ఇటీవల మాటమార్చారు. ‘అదొక విఫల విధానం. భారీ సంస్కరణలు తేవాల్సిందే’అని అన్నారు. గతంలో దీనికి పూర్తిభిన్నంగా మాట్లాడారు.
‘హెచ్–1బీ కారణంగానే నేను అమెరికాలో స్థిరపడగలిగా. నేను మాత్రమే కాదు నా సంస్థలైన టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్, ఇతర కీలక సంస్థల ఏర్పాటులో నాకు సాయపడిన వారెందరినో హెచ్–1బీ అమెరికా కలలను నెరవేర్చింది. చట్టబద్ధ వలసలకు ఇది స్వర్గధామం. హెచ్–1బీ కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం. హెచ్–1బీని తప్పుబట్టేవాళ్లను ముఖం మీదనే చాచికొడతా’అని గతంలో అన్నారు. ఇలా మాట్లాడిన కొద్ది కాలానికే మస్క్ స్వరం మార్చారు. ‘హెచ్–1బీ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వృత్తినిపుణులుకు కనీస వేతనం పెంచడం, మెయింటెన్స్ ఖర్చులు పెరగడంతో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే ఇలా విదేశీయులను పనిలో పెట్టుకోవడం ఆర్థికంగా భారమే. ఇవన్నీ చూస్తుంటే హెచ్–1బీ అనేది కాలంచెల్లిన విధానంగా అఘోరించింది. దీనిలో భారీ సంస్కరణలు తీసుకురాక తప్పదు’అని అన్నారు.