COP27: భూమాత రక్షణకు భుజం కలిపి...

COP27: UN climate talks kick off in Egypt amid major world crises - Sakshi

ఈజిప్ట్‌లో ‘కాప్‌–27’ ప్రారంభం 

నేడు, రేపు విస్తృతస్థాయిలో సంప్రదింపులు 

వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపై చర్చలు  

కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం  

షెర్మ్‌–ఎల్‌–షేక్‌(ఈజిప్ట్‌):  ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన కొరత వంటి ప్రతికూల పరిణామాల నడుమ భాగస్వామ్యపక్షాల సదస్సు   (కాప్‌–27) ఆదివారం ప్రారంభమయ్యింది. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంత నగరం షెర్మ్‌–ఎల్‌–షేక్‌ ఇందుకు వేదికగా మారింది. ప్రపంచదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు.

వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్‌–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్‌ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.  

తరానికి ఒకసారి వచ్చే అవకాశం  
వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ చైర్మన్‌ హోయిసంగ్‌ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్‌–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్‌ హౌజ్‌) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు.  

ఇంకెన్ని హెచ్చరికలు కావాలి?  
గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్‌–26 అధ్యక్షుడు, బ్రిటిష్‌ రాజకీయవేత్త అలోక్‌ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్‌ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్‌) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు.

పారిస్‌ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్‌ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు.

మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్‌ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్‌ క్లైమేట్‌ చీఫ్‌ సైమన్‌ స్టియిల్‌ మాట్లాడారు. పారిస్‌ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సమేహ్‌ షౌక్రీ చెప్పారు. కాప్‌–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిస్సీ   పిలుపునిచ్చారు.  

జిన్‌పింగ్, నరేంద్ర మోదీ లేకుండానా?
కాప్‌–27 సదస్సులో 120కి పైగా దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటారని ఈజిప్ట్‌ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారా? లేదా? అనేది  ఇంకా నిర్ధారణ కాలేదు. కర్బన ఉద్గారాల విషయంలో పెద్ద దేశాలైన చైనా, భారత్‌ అధినేతలు లేకుండా కాప్‌–27 సదస్సులో కుదిరే ఒప్పందాలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కాప్‌ సదస్సు వేదిక వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మానవ హక్కుల సంస్థల ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు దిగిన వారిని అరెస్టు చేశారని న్యూయార్క్‌కు చెందిన ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ ఆరోపించింది. నిరసనకారులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top