
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
నాంపల్లి: పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంబడించి దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం రెడ్‌హిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ హఫీజ్ బాబానగర్‌కు చెందిన యాన్ ఖురేషీ (22) తన బావ మరిది హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్ల వయస్సులోనే హత్యకు పాల్పడిన అతను జువైనల్ హోమ్‌కు వెళ్లాడు. కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసుపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఉదయం కేసు విచారణకు హాజరైన యాన్ ఖురేషీ బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్‌తో దాడి చేశారు. కిందపడ్డ అతడిపై దాడి చేసి కత్తులతో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా కడుపులో కసితీరా పొడిచారు. దీనిపై సమాచారం అందడంతో నాంపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెడ్‌హిల్స్‌లో ఘటన