
లాంలో మిరప విత్తనాలు సిద్ధం
తెనాలి: ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం (లాం ఫారం)లో జూన్ 16వ తేదీ నుంచి మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఎల్‌సీఏ–643: ఇది పచ్చి, ఎండు మిర్చికి అనువైన రకం. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (13–14 సెం.మీ.) ఆకర్షణీయంగా ఉంటాయి. ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపుతో బ్యాడగి రకం మాదిరి ఉంటాయి. బెట్టను, కొంతవరకు జెమిని వైరస్‌ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతిగా ఉన్నప్పటికీ కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో, అధిక దిగుబడి ఇస్తుంది.
ఎల్‌సీఏ–625 : ఎండు మిరపకు అనువైనది. మొక్కలు బలిష్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి, కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎద పెట్టడానికి మిక్కిలి అనువైన రకం. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవుతో (8–10 సెం.మీ. ) ఉంటాయి. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45000–50000 ఎస్.హెచ్.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఏఎస్‌టీఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉంటుంది. అధిక ఘాటు వల్ల కాయ కుళ్లు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు తక్కువుగా వస్తాయి.
ఎల్‌సీఏ–657: తొలకరి తరువాత నేరుగా ఎద పెట్టుకోవడానికి అనువైన రకం. జెమిని వైరస్‌ను తట్టుకుంటుంది. మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో నిటారైన కొమ్మలు కలిగి, బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాయలు పొడవుగా (11–12 సెం.మీ.), ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమ కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు అధిక ఘాటు (50,000–55,000 ఎస్.హెచ్.యు), మంచి రంగును కలిగి ఉంటాయి. ఇది అధిక బెట్టను తట్టుకునే రకం.
16వ తేదీ నుంచి లభ్యత
విత్తనాలు కొనదలచిన రైతులు నేరుగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం లాం ఫారంలో జూన్ 16వ తేదీ మొదలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు విత్తనం లభ్యత ఉన్నంత వరకు పొందవచ్చును.( రెండవ శనివారం, ప్రతి ఆదివారం శెలవు దినాలు ). కిలో విత్తనం ధర రూ. 1,200. విత్తనాలు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం లాం ఫారంలో మాత్రమే లభిస్తాయి. అవే పేర్లతో బయట ఎవరైనా అమ్మితే రైతులు మోసపోవద్దని వెంకట రమణ సూచించారు. ఆసక్తి కలిగినవారు 99898 09554 / 9440592982 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

లాంలో మిరప విత్తనాలు సిద్ధం