Movie Ticket Prices: టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?

Sakshi Guest Column Kommineni Srinivasa Rao Ap Cinema Ticket Price Issue

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే  టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్‌ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి.

నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్‌ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్‌తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు.

అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్‌’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్‌ కల్యాణ్‌కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్‌ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్‌లో తీసు కుంటారా? బ్లాక్‌లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. 

ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్‌ కళ్యాణ్‌ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు

పెట్టుకోవాలని భావిస్తారా? 
నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది.

ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు  ఇవ్వవచ్చు.

కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్‌ యాదవ్‌ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? 

థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి.  సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! 

ఆన్‌లైన్‌ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్‌ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్‌లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. 

మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అయితే ప్రధానంగా ఒక్క జగన్‌ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట.  ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్‌ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. 

సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో!

కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top