వివాహానికి...సమావర్తనం

Shodasha Samskara Special Story In Telugu - Sakshi

సమావర్తనానికే స్నాతకమని పేరు. వేదాధ్యయనం పూర్తిచేసుకున్న బ్రహ్మచారి, ఆ ఆచార్యుని కోరికననుసరించి, గురుదక్షిణ సమర్పించి, గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి గురుకులంనుండి ఇంటికి తిరిగి వెళ్ళడాన్నే సమావర్తనం అంటారు. ఈ సంస్కారానికి స్నానం అనే కార్యక్రమం ముఖ్యంగా చెప్పబడింది. ఎందుకంటే, బ్రహ్మచర్య వ్రతంలోవున్న విద్యార్థిని అనగా వేదాధ్యయనం చేసే బ్రహ్మచారిని కొన్ని దివ్యశక్తులు ఆవహించి వుంటాయి. వానిని ఈ ప్రత్యేకమైన స్నాతకం ద్వారా ఉద్వాసన చేయాలి. లేనిచో, లౌకిక జీవితంలో ప్రవేశించిన బ్రహ్మచారి ఆ దివ్యశక్తులను భ్రష్టుపట్టిస్తాడు. కాబట్టి దైవానుగ్రహం పొందలేడు అనేది శాస్త్రం. ఈ స్నాతక సంస్కారం పూర్తైన తర్వాత నుండి, బ్రహ్మచారికి మంచం మీద నిద్రించే అర్హత వస్తుంది. అంతవరకు ఆ బ్రహ్మచారి నేలమీదే నిద్రించాలి. కానీ ఒకవేళ ఆ బ్రహ్మచారి తన తండ్రి వద్దనే వేద విద్యను వంశపారంపర్యంగా అధ్యయనం చేస్తే, ఈ స్నాతకాన్ని జరిపించాల్సిన అవసరం లేదని కూడా కొందరు శాస్త్రకారుల వచనం.

ఈ సంస్కారం జరిగిన తర్వాత, భిక్షాటన, యాచన చేయరాదని శతపథ బ్రాహ్మణం చెప్తుంది. బ్రహ్మచర్య నియమాలు పాటించక భ్రష్టుపట్టినవారికి, సంపూర్ణ వేదాధ్యయనం చేయనివారికి, వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా, కేవలం వేదాన్ని కంఠతా పట్టినవారికి ఈ స్నాతక సంస్కారం చేయించుకునే అర్హత ఉండదు అని శాస్త్రకారులు ఘంటాపథంగా తెలియజేశారు. ఈ సంస్కారాన్ని బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టిన 48 సంవత్సరాలలోపే జరిపించాలని, ఆ తర్వాత అనర్హుడని శాస్త్రం. ఎందుకనగా, బ్రహ్మచారికి ఒక్కొక్క వేదా న్ని అధ్యయనం చేయడానికి, 12 సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి, ఒకవేళ బ్రహ్మచారి, నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసినా కూడా 48 సంవత్సరాల కాలం సరిపోతుంది కనుకనే ఆ నియమం విధించారు. 

బ్రహ్మచారి గనుక నిరుపేద ఐతే, వేదాధ్యయనం ప్రారంభించేటప్పుడే, ఆ బ్రహ్మచారి, తాను నిరుపేదననీ, ఎటువంటి గురుదక్షిణనూ ఇవ్వలేననీ గురువుతో తెలిపి, ఆయన అనుమతి తీసుకుని, వేదాన్ని అధ్యయనం చేయాలని ఒక నియమం. తన విద్యతో, గుణగణాలతో, సంస్కారంతో గురువును మెప్పించగలిగితే, అందుకు సంతోషించిన గురువు, ఆ బ్రహ్మచారికి స్నాతకాన్ని నిర్వహించే అవకాశాన్ని శాస్త్రం తెలియజేసి వుంది. ఈ సంస్కారాన్ని ఉత్తరాయణంలో, శుక్లపక్షాలలో, రోహిణీ, మృగశిరా, పుష్యమీ, ఉత్తరా, హస్తా, చిత్రా, స్వాతీ, విశాఖా నక్షత్రాలలో జరిపించాలని శాస్త్రం.

సంస్కార విధానం: శుభదినాన, శుభముహుర్తాన, గణపతిపూజ, పుణ్యహ వాచనాలను జరిపించాలి. తర్వాత, విశేషించి, అప్పటివరకు ఆచరించిన బ్రహ్మచర్య వ్రతంలో తెలిసీ తెలియక తనచే ఏర్పడిన 33 రకాల దోషాలకు, అంటే, స్నాన జప సంధ్యావందన అనుష్ఠానాలని సరిగా నిర్వహించకపోవడం, మంచంపైన నిద్రించడం, భిక్షాన్నం తినకపోవడం, అగ్నికార్యం నిర్వహించకపోవడం, కౌపీన మేఖల దండాదులని ధరించకపోవడం, ధర్మాతిక్రమణం చేయడం, ధర్మ భ్రష్టులతో సహవాసం చేయడం, తినగూడనివి తినడం, మొదలగు దోషాలు పోగొట్టుకోవడానికి, పాహిత్రయోదశ హోమాన్ని చేయాలి. ఆ తర్వాత వివిధరకాలైన హోమాలు చేసి దేవతలకు హవిస్సులర్పించాలి. అష్టదిక్పాలకులను ఆవాహించిన ఎనిమిది జలకలశాలు వుంచి, కార్యక్రమం పూర్తైన తర్వాత ఆ కలశాలలోని నీటితో స్నానం చేయాలి.

ఈ స్నానం, అష్టదిక్కులనుండి అతనికి రక్షణ కలగాలని గుర్తుగా ఆ ఎనిమిది కలశాలలోని నీటితో చేయిస్తారు.ఆ తర్వాత, స్వర్ణశిల్పాచార్యులచే నూతనంగా తయారుచేయించిన ఒక బంగారు పూసలో దారంగుచ్చి మెడలో ధరించాలి. తర్వాత, అప్పటివరకు ధరించిన మేఖలాలు, అజినం, దండాలని నిమజ్జనంచేయాలి. పిమ్మట, శిల్పాచార్యులకు, పురోహితులకు దక్షిణలను ఇచ్చి వారిని సంతుష్టులను చేయాలి. అప్పటినుండి అతడు స్వర్ణాభరణాలను, రంగు వస్త్రాలని, ఛత్రాన్ని, అద్దాన్ని ఉపయోగించచ్చు. క్షౌరం చేసుకోవచ్చు. రథాన్ని, అశ్వాన్ని, గజాన్ని ఎక్కవచ్చు.

ఈ స్నాతకంలో ఆఖరుగా, అప్పటివరకు వేదవిద్యను నేర్పించిన గురువు, ఆ బ్రహ్మచారికి, ఆఖరిసారిగా, ‘సత్యంవద (సత్యమునే పలుకవలెను), ధర్మంచర (ధర్మాన్నే ఆచరించవలెను), మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ (తల్లితండ్రులు, గురువు, అతిథి దేవతలతో సమానం)’ అని చెప్తూ, ఆరోగ్యమే మహాభాగ్యమనీ, ధర్మ మార్గాలద్వారానే ధన సంపాదన వుండాలని, చదువుకోవడం, చదువుచెప్పడంలలో అలసత్వం వుండకూడదనీ, యజ్ఞయాగాదులు, పితృకర్మలూ మరువరాదనీ, అవైదికాలను గ్రహింపరాదని, ఇతరులచే నిందింపబడే పనులకు దూరంగా వుండాలనీ, పెద్దలను గౌరవించాలని, మూర్ఖులతో వాదించరాదని, విముఖతతో దానాలను ఇవ్వరాదనీ, గ్రహణ సమయాలలోనూ నీటిలోనూ సూర్యుణ్ణి, తన ప్రతిబింబాన్ని చూడరాదనీ, గోవులు, గురువులు, దేవతా విగ్రహాలు, ఆజ్యపాత్ర, తేనెపాత్ర, నాలుగుదారుల కూడలి కనిపించినప్పుడు ప్రదక్షిణ చేయాలని, అగ్నిని దాటకూడదని, కాళ్ళకింద నిప్పును వుంచుకోరాదని, అసుర సంధ్యవేళ భోజనం, నిద్ర, మైథునాలు కూడదనీ, ఋతుమతులతో సంభాషణ కూడదని, భుక్తాయాసం వచ్చునట్లు తినకూడదని, కంచుపాత్రలో కాళ్ళు కడగరాదని, గోళ్ళు కొరకటం,గోటితో దర్భ, గడ్డిని కోయుట కూడదని, రాత్రిళ్ళు చెట్లకింద నిద్రించరాదని, ఇద్దరు బ్రాహ్మణుల మధ్యనుండి వెళ్ళకూడదని, క్షుద్రులకు, జూదరులకు, వేశ్యలకు దూరంగా వుండాలని, భోజనం, మలమూత్ర విసర్జనం, యోగాభ్యాసం, సంగమం ఎవ్వరికంటా పడకుండా చేయాలని, తపస్సు, ఆయుష్షు, ధనం, ఆస్తులను గోప్యంగా వుంచాలని, ఇటువంటి ఎన్నో ధర్మాలను, జాగ్రత్తలను గురుబోధ చేస్తాడు. ఈ సంస్కారం పూర్తిచేసుకున్న తరువాత బ్రహ్మచారి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికై వివాహమాడటానికి అర్హుడౌతాడు.  
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top