
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సీఈసీ ప్లస్ సీఏ అంటూ వస్తారు. తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటివాళ్లు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల ‘అందరూ ఎంచుకునే దారి’లోనే ప్రయాణిస్తుంటారు.
ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేకమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలాంటి సమస్యలతో కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యల్లో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది– కెరీర్ కౌన్సెలింగ్.
కెరీర్ కౌన్సెలింగ్ అంటే...
పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సెలింగ్ ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సెలింగ్‌లో ‘ఏది ఫేమస్’ అని కాకుండా, ‘ఏది మీకు బెస్ట్’ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.
ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే? ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది. మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే! అలాగే పదో తరగతి తరువాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి.
కెరీర్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరమంటే...
∙మనకు తెలియని అంతర్గత శక్తులను బయటకు తేవడానికి ∙మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుగొనడానికి ∙‘అందరూ చేస్తున్నది నేనూ చేయాలి’ అనే ఉచ్చులోంచి బయటపడడానికి ∙భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్లు, రిస్క్‌లు తెలుసుకోవడానికి ∙మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం.
పదో తరగతి తర్వాత విద్యావకాశాలు...
పదో తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం. దానిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసే అవకాశమూ ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్లు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఇవి కాకుండా అరుదుగా తెలిసిన, భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. కాని, వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ప్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలున్నాయి. ఉదాహరణకు, యానిమేషన్ అండ్ వీఎఫ్‌ఎక్స్‌లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు.
కౌన్సెలింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు
∙తల్లిదండ్రులు, ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్స్ మధ్యలోనే బోర్ కొడుతుంది.
∙మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి. ∙‘నాక్కావాల్సింది ఇది కాదు’ అని గుర్తించినప్పుడు మళ్ళీ రీ–స్టార్ట్ చెయ్యాలి. ∙విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృథా అవుతాయి. ∙చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది.
కౌన్సెలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు
∙మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్స్‌ను గుర్తించగలుగుతారు. ∙స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి. ∙‘అందరూ వెళ్తున్న దారి’ కంటే ‘నాకు సరిపోయే దారి’ఎంచుకునే ధైర్యం వస్తుంది. ∙భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. ∙ప్రవేశ పరీక్షలు, అందుకు కావాల్సిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు.