బ్రాయిలర్‌ కోడి బోరింగ్‌.. అదే నాటుకోడి కూరయితే మహా టేస్టు! | Demand for Desi (Natukodi) Chicken Surges Amid Declining Broiler Preference | Sakshi
Sakshi News home page

రేటెక్కువయినా పర్లేదు, నాటు కోడి కూరే కావాలంటున్న జనం

Sep 20 2025 11:38 AM | Updated on Sep 20 2025 11:47 AM

Natu Kodi Market in Vizianagaram

పెరుగుతున్న వినియోగం

గ్రామాల్లో పెంపకంపై ఆసక్తి

విజయనగరం: కొంతకాలంగా బ్రాయిలర్‌ కోళ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నెలలో కనీసం నాలుగురోజులైనా బ్రాయిలర్‌ చికెన్‌ ఉండాల్సిందే. చుట్టాలు, బంధువులు వచ్చినా.. కథా కార్యక్రమం జరిగినా బ్రాయిలర్‌ కోళ్లు కోసి భోజనం పెట్టాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ మారుతోంది. బ్రాయిలర్‌ కోడి మాంసంపై మాంసాహారులకు అయిష్టత ఎక్కువైంది. బలవర్థక ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో పాటు రుచికర వంటలపై దృష్టిపెడుతున్నారు. దీంతో 45 రోజుల్లో పెరిగే బ్రాయిలర్‌ కోడి మాంసానికి స్వస్తిపలికి ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలం పాటు పెరుగుదలకు పట్టే నాటుకోడి మాంసంపై ఆసక్తిచూపుతున్నారు. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకూ అన్నిచోట్ల ఇప్పుడు  హాట్‌టాపిక్‌గా మారింది.

గతంలో మాదిరిగా..
20వ దశకం వరకూ గ్రామాల్లో నాటుకోడి పెంపకాలు అధికంగా ఉండేవి. ప్రతి ఇంటి వద్ద నాటుకోళ్లు పెంచడం, వాటి గుడ్లు తినడం అమ్మకాలు చేయడం చేసేవారు. ఆ తరువాత కాలంలో బ్రాయిలర్‌ పౌల్ట్రీలు రావడం, మారుమూల గ్రామాల్లో సైతం చికెన్‌ సెంటర్లు అందుబాటులోఉండడం, కిలో చికెన్‌ ధర రూ.200 నుంచే లభించడంతో నాటుకోడి కొనుగోళ్లు పడిపోయాయి. గ్రామాల్లో ఇంటిపెరడు, ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో వాటి పెంపకానికి చాలామంది స్వస్తి పలికారు. 

బ్రాయిలర్‌ కోడిమాంసం రుచి తగ్గడం, వాటిలో పలు కంపెనీలు రావడం, తరచూ రకరకాల వ్యాధులు వచ్చి బ్రాయిలర్‌ కోళ్లు చనిపోవడంతో మాంసాహారుల్లో ఆ మాంసంపై చులకన ఏర్పడింది. తింటే నాటుకోడి లేకుంటే గొర్రె మాంసం తినాలనే చందంగా ఇప్పుడంతా నాటుకోడి మాంసంపై పడ్డారు. దీంతో వాటి డిమాండ్‌ కారణంగా గ్రామాల్లో చిన్నచిన్న నాటుకోడి ఫామ్‌లు, పెద్ద పెద్ద కుటుంబాలు సైతం తమ పంటపొలాల్లో కొంత స్థలాన్ని నాటుకోడి పెంపకాలకు ఏర్పాటుచేయడం, పలుచోట్ల నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి.

భలే డిమాండ్‌
ప్రస్తుతం గ్రామల్లో గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటికి తోడు దసరా ఆయుధపూజకు అధికంగా నాటుకోళ్లు మొక్కుతారు. దీంతో ఇటీవల వీటికి డిమాండ్‌ ఎక్కువైంది. నాటుకోడి మాంసానికి మటన్‌ ధర మాదిరిగానే రేటు పలుకుతోంది. కిలో కోడి ధర రూ. 800 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కిలోన్నర కోడి చేస్తే కిలో చికెన్‌ వస్తుంది. ఇంత ధర ఉన్నా ఈ కోడి మాంసాన్నే అందరూ ఇష్టపడుతున్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండవని, పలురకాల గాయాల బారిన పడినవారు, ఆపరేషన్లు జరిగినవారంతా ఈ నాటుకోడి మాంసాన్ని వినియోగిస్తే వేగంగా నయమౌతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్‌ వచ్చింది. వీటితో పాటు నాటుకోడి గుడ్డు ధర కూడా మార్కెట్లో అధికంగా పలుకుతోంది. ఒక గుడ్డు ధర రూ.20లు వరకూ విక్రయాలు జరుగుతున్నాయి.

వ్యాపారం బాగుంది
మా వద్ద నాటుకోళ్లు, సొనాయిలు నాటు, కథక్‌నాథ్‌ కోళ్లు లభిస్తాయి. గత ఏడెనిమిదేళ్లుగా నాటుకోళ్ల ఫారం నడుపుతున్నాం. ఓపికతో వాటి పెంపకంచేయాలి. మంచి ధర వస్తుంది. ఇప్పుడు వీటికి చాలా డిమాండ్‌ ఉంది. కిలోన్నర కోడి పెరగగానే కొనుక్కుని వెళ్లిపోతున్నారు.
శాసపు చిన్నబాబు, నాటుకోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement