
సాధారణంగా లోకంలో... రామాయణంలోని మంథర కపట స్వభావం గలది అనీ, భరతుని కంటే కూడా రామునిపై ఎక్కువ పుత్ర ప్రేమను చూపించే కైకేయి మనసును విరిచి, రాముడిని వనవాసానికి పంపేటట్లు చేసిందనీ ఆమె పాత్ర స్వభావం గురించి ఒక విశ్లేషణ ఉంది. కానీ, అధ్యాత్మ రామాయణంలో, రామావతార పరమార్థం నెరవేరటానికి సరస్వతీ దేవి ప్రేరణతో ఆమె అలా వైరభావం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది.
రామ పట్టాభిషేక వార్త విని, కౌసల్యా దేవి ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని లక్ష్మీదేవిని పూజించింది, దుర్గాదేవిని పూజించింది. అయినా ఆమె మనసులోకించిత్ వ్యాకులత ఉందిట. జరగబోయేది ముందుగానే సూచనగా తెలుస్తున్నది ఆమెకు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా కలిసి, వాగ్దేవి సరస్వతిని ప్రేరేపించారు: ‘నీవు భూలోకంలో అయోధ్యా నగరానికి వెళ్లు. రామ రాజ్యాభిషేకానికి విఘ్నం కలగజేయటానికి యత్నించు. ముందు మంథర మనసులో ప్రవేశించి, ఆమెలో వ్యతిరేక భావం కలిగించు. తర్వాత కైకేయిలో ప్రవేశించి ఆ విధంగానే చెయ్యి. రామ రాజ్యాభిషేకం ఆగిపోతే గానీ, రామావతార పరమార్థం నెరవేరదు,’ అని చెప్పారు. సరస్వతి దేవి సరేనని బయలుదేరింది. అయోధ్యా నగరం చేరి మంథర మనసులో ప్రవేశించింది.
కైకేయితో మంథర ‘నీకు గొప్ప ఉపద్రవం రాబోతోంది. రేపు రామునికి పట్టాభిషేకం జరగబోతోంది’ అంది. కైకేయిసంతోషంతో దివ్యమైన మణి నూపురాన్ని మంథరకు బహు మతిగా ఇచ్చింది. సరస్వతీ దేవి ప్రేరణతో మంథర... కైకేయి మనసు బాధ పడేట్లు, రామ పట్టాభిషేకం జరిగితే కౌసల్యకు దాసిలా ఉంటావని చెపుతుంది. ఆ మాటల ప్రభావంతో కైకేయి మనసులో మార్పు వచ్చి, కోప గృహంలో చేరింది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లడం, సీతాపహరణం, రావణ సంహారం... ఇలా ఎన్నో ఘట్టాల్లో రాముడు తాను నిర్వర్తించా ల్సిన సకల కార్యాలను నిర్వర్తించాడు.
– డా.చెంగల్వ రామలక్ష్మి