జీతం పెరిగింది.. లిస్టు ఇవ్వండి!

EU Orders Over Equal Pay For Same Work To Female And Male - Sakshi

స్త్రీ పురుష ఉద్యోగుల జీతాలు, వేతనాల్లో అసమానతలను తొలగించాలని ఇ.యు. తన పరిధిలోని  దేశాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఫలిస్తే.. తక్కిన దేశాలూ ఆచరిస్తే.. స్త్రీ పురుషులు ఇక ఈక్వల్‌ ఈక్వల్‌. సమాన పనికి సమాన వేతనం. 

లిస్ట్‌ ఇవ్వండి
జెండర్‌ ‘పే గ్యాప్‌’ను తొలగించే చర్యలలో భాగంగా.. 27 సభ్య దేశాల్లోని కంపెనీలు తమ సిబ్బందిలో ఎవరికి ఎంత జీతం ఇస్తున్నాయో తక్షణం బహిర్గత పరచాలని ‘ఐరోపా సమాఖ్య’ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సుల వాన్‌ డెర్లెయన్‌ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంస్థలు తమ సిబ్బందికి గోప్యంగా, విడివిడిగా జీతాలు పెంచుకుంటూపోతున్న కారణంగానే సమానమైన పనికి కూడా స్త్రీలకు తక్కువ ప్రతిఫలం లభిస్తోందని ఆమె గుర్తించడం.. ఈ ఏడాది ‘ఉమెన్స్‌ డే’ కి తమకు లభించిన బోనస్‌ అని ఆ దేశాలలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఒకే పని. ఒకే విధమైన పని గంటలు. కానీ వేతనం ఒకటే కాదు. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ! ప్రపంచమంతటా ఇంతే. ఏళ్లుగా ఇంతే. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో చెప్పలేం. స్త్రీ పురుషుల వేతనాల్లో హెచ్చు తగ్గుల్ని లేకుండా చేయడానికైతే శతాబ్దాలు అక్కర్లేదు. దశాబ్దాలూ అక్కర్లేదు. కొంత టైమ్‌ ఇచ్చి, ఆ టైమ్‌ లోపు ‘ఈక్వల్‌ పే’ ఉండాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే చాలు.. వేతనాల్లో, జీతాల్లో అసమానత్వాలు, అంతరాలు సమసిపోతాయి. మరి ప్రభుత్వాలు చెయ్యకనేనా నేటికీ మహిళా ఉద్యోగులు, మహిళా శ్రామికులు పురుషులకన్నా తక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు! శ్రమదోపిడికి గురవుతున్నారు! కాదు.

కంపెనీలే స్త్రీ పురుష వివక్ష ను పాటిస్తున్నాయి. ‘మీరు చెప్పినట్లే ఈక్వల్‌ ఈక్వల్‌గా ఇస్తున్నాం’ అని పైపై లెక్కలు చూపిస్తున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే విధమైన పనిని, ఒకే పనిగంటల్లో చేస్తే వారిద్దరికీ ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తున్నామని చెబుతున్నాయి. చెప్పడం వరకే. చేస్తున్నది వేరే. పురుషులకు ఎక్కువ. స్త్రీలకు తక్కువ! అలా ఎలా చేయగలుగుతున్నాయంటే.. గోప్యత. రహస్యం! నిజంగా ఎంతిస్తున్నదీ కంపెనీలు బయటపెట్టడం లేదు. ఇక ఇలాక్కాదని చెప్పి, ప్రతి ఉద్యోగికీ మీరెంత జీతం ఇస్తున్నదీ పేర్లతో సహా బహిర్గతం చేయండి అని ఐరోపా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ ‘యూరోపియన్‌ యూనియన్‌’ (ఇ.యు) కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్లెయన్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కాస్త ముందు ఆమె ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం యాదృచ్ఛికమే అవొచ్చు కానీ ఇ.యు. పరిధిలోని 27 దేశాల మహిళా ఉద్యోగులు దీనినొక ఉమెన్స్‌ డే బోనస్‌గా భావిస్తున్నారు. 
∙∙∙
నిజమే. వేతనాల్లో వివక్షతో కూడిన వ్యత్యాసం తగ్గాలంటే.. అసలు ఎవరికి ఎంత వేతనం ఇస్తున్నదీ ముందు తెలియాలి. అందుకే ఆ లిస్ట్‌ను బహిర్గతం చెయ్యమని వాన్‌ డెర్లియన్‌ ఆదేశించారు. ఇ.యు. దేశాలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉంటాయనే పేరుంది. అయితే అక్కడ కూడా వేతనాలలో  మిగతా దేశాలలో ఉన్నట్లే మహిళలపై వివక్ష ఉంది! ఇ.యు. 1957లో ఏర్పడింది. అప్పట్నుంచీ ‘పే గ్యాప్‌’ ను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. కావడం లేదు. జీతాలు, వేతనాలు, పని వేళలు, పెన్షన్‌లు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటా సంస్థల యాజమాన్యాలు ఈ గ్యాప్‌ను పాటిస్తూనే ఉన్నాయి. గత 30–40 ఏళ్లలో ఇ.యు. ఎంతగానో పాటు పాడితే తగ్గిన వేతన అంతరం 30 శాతం మాత్రమే. ఇది నూరు శాతం అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో!

అయితే వాన్‌ డెర్లెయన్‌ అంతవరకు ఆగదలచుకోలేదు. ఏడాది క్రితం కమిషన్‌ అధ్యక్షురాలిగా వచ్చిన నాటి నుంచీ ఐరోపా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ క్రమంలో బుధవారం జారీ చేసినవే.. ప్రతి కంపెనీ తమ పే లిస్ట్‌ను బయటపెట్టి తీరాలన్న ఆదేశాలు. అప్పుడు ఎవరికి ఎంతిస్తున్నదీ తెలుస్తుంది. స్త్రీలకు ఎంత వస్తున్నదీ బయటపడుతుంది. ఆ ప్రకారం కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. చర్యల భయం ఉంటే కంపెనీలూ వాటికై అవి వేతన అంతరాలను తొలగించేందుకు ముందుకు వస్తాయి. 
∙∙∙
ఆదేశాలతోపాటు కొన్ని ప్రతిపాదనలకు ఆదేశ రూపం ఇచ్చేందుకు కూడా కమిషన్‌ సభ్యులను సోమవారం సమావేశ పరచబోతున్నారు వాన్‌ డెర్లెయన్‌! కంపెనీలు ఇకపై ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించే ముందు కానీ, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గానీ వారి పూర్వపు వేతనాన్ని (మునుపటి కంపెనీలో వాళ్లకు వస్తున్న వేతనం) అడగకూడదు. ఫలాన పోస్టుకు ఇంత జీతం అని ప్రకటించాక ఆ తర్వాత పురుషుడు అని పెంచడం గానీ, స్త్రీ అని తగ్గించడం కానీ చేయకూడదు. ఉద్యోగానికే జీతం తప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీతం కాదు అన్నట్లు ఉండాలి. మహిళలైతే తాము చేరబోయే సంస్థలో స్త్రీ పురుషుల జీతాలలో వ్యత్యాసం ఏ మేరకైనా ఉందా అని ముందే ఆ సంస్థ యాజమాన్యాన్ని అడిగే హక్కు కలిగి ఉండాలి.

కనీసం 250 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ తమ జీతాల్లోన్ని జెండర్‌ వ్యత్యాసం గురించి విధిగా తమ మహిళా అభ్యర్థులకు తెలియపరచాలి. ఇప్పటికే పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తాము ఎంతకాలంగా తక్కువ జీతాన్ని పొందుతున్నారో, ఆ తగ్గిన మొత్తాన్ని అడగవచ్చు. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుంచి యాజమాన్యాలు తొలగించకూడదు. ఇవీ.. ఆ ప్రతిపాదనలు. కంపెనీలతోపాటు, కోవిడ్‌ కూడా మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు, ఆఖరికి ఉపాధిని కూడా లేకుండా చేసింది. ఆ పరిహారాన్ని కూడా కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు వాన్‌ డెర్లెయన్‌ మరొక ఆదేశ పత్రం ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు.

చదవండి: చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top