మూడు సంస్థలతో నిట్ ఒప్పందం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపి నిట్) సోమవారం మూడు ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైద్రాబాద్‌కు చెందిన మిల్టన్ సోనిక్ డిఫెన్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్.వి.రమణరావు మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెంచేలా పలు కంపెనీలు, విద్యాసంస్ధలతో అవగాహనా ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. సంస్థలో చదువుకుంటున్న విద్యార్థలు పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాంగణ ఎంపికలు, ప్రాజెక్టుల ఎంపికల అభివృద్ధి నిమిత్తం ఇప్పటి వరకు నిట్ 35 కంపెనీలలో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. కార్యక్రమంలో టాటా ప్రతినిధి టీవీ సూర్యప్రకాశరావు, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, మిల్టన్ ప్రతినిధి బి.మహేందర్‌తో పాటు నిట్ అధికారులు పాల్గొన్నారు.
వీరవాసరం : ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు కాలవలోకి జారి తిరగబడిపోయింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ రాజనాల పెద్దిరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాలేపల్లి నుంచి వీరవాసరం రైస్ మిల్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ధాన్యం బస్తాలు నీట మునిగి ముద్దయ్యాయి. చుట్టుపక్క రైతులంతా ట్రాక్టర్‌ను బయటకు లాగేందుకు సాయపడ్డారు. ధాన్యం మిల్లుకు పంపగా తడిసిపోయాయని ఆరబెట్టుకుని రావాలని మిల్లర్లు పేర్కొనడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వీరవాసరం: డిసెంబర్ 2, 3, 4న మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీరవాసరంలో జరగాల్సిన 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర అంతర జిల్లాల సాఫ్ట్‌బాల్, అండర్ 17 బాల బాలికల టోర్నమెంట్ కమ్ స్టేట్ టీం సెలక్షన్‌న్స్ తుపాను కారణంగా వాయిదా వేశామని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) జిల్లా నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికై ంది. నూతన అధ్యక్షుడిగా గుడిమెల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా గుండె వెంకటరమణ ఎన్నికయ్యారు. కార్యవర్గంలో పలువురిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు బి.మనోజ్ కుమార్, పరిశీలకులుగా రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూపతి రామారావు వ్యవహరించారు.
మూడు సంస్థలతో నిట్ ఒప్పందం


