టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా..
నరసాపురం: రోడ్డు దాటుతున్న వ్యక్తి మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై జయలక్ష్మి తెలిపిన వివరాలు ఇవి. మొగల్తూరు మండలం కాళీపట్నం పల్లెపాలెంకు చెందిన రామాని గోపాలకృష్ణ(51) ఫైనాన్స్ చెల్లింపు నిమిత్తం ఉదయం నరసాపురం వచ్చాడు. మిస్సమ్మ ఆసుపత్రి వద్ద టీ తాగేందుకు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా, మొగల్తూరు వైపు వెళుతున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు గాయాలైన గోపాలకృష్ణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై చెప్పారు.
పాలకోడేరు: మైగ్రేన్ తలనొప్పి భరించలేని స్థితిలో మంచినీళ్లు అనుకుని పొరబాటున పురుగుల మందు తాగి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే మోగల్లు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి దుర్గారావు (43) భీమవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తరచూ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీ రాత్రి తీవ్రమైన తలనొప్పి రాగా చీకటిలో మంచినీళ్ల బాటిల్ అనుకుని పురుగుల మందు బాటిల్ మూత తీసుకుని తాగాడు. దీంతో కడుపునొప్పి ఎక్కువై కేకలు వేయగా భార్య రాధ వెంటనే భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 1వ తేదీన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం అందడంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు.
ద్వారకాతిరుమల: క్షేత్రంలోని బైపాస్ రోడ్డు మార్జిన్‌లో డ్రెయినేజీపై కాంక్రీటు దిమ్మలు పోసే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్త బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కామవరపుకోట వైపునకు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ సెంటర్ నుంచి సూపర్ బజార్ వరకు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మీదగానే ప్రయాణిస్తాయి. పాత రోడ్డు ధ్వంసం కావడంతో గతేడాది అక్టోబర్ 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.40 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేశారు. అయితే మార్జిన్‌లోని డ్రెయినేజీకంటే రోడ్డును ఎత్తుగా నిర్మించడంతో, వాహనాలు ఎదురూ బదురు అయినప్పుడు అవి మార్జిన్ దిగే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై అక్టోబర్ 7న ‘సాక్షి’లో ‘మార్జిన్ దిగితే.. అంతే’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు డ్రెయినేజీపై కాంక్రీటు దిమ్మలను నిర్మించే పనులు చేపట్టారు. దాంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా..
టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా..


