ప్రతిపక్షంగా రాజీలేని పోరాటం
దమ్ముంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలి
కై కలూరు: ప్రతిపక్షంగా రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో మొదటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అధ్యక్షతన మండవల్లి మండలం పెరికేగూడెం డాల్పిన్ ఫ్యాక్టరీలో మంగళవారం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం, నియోజకవర్గాలో పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై సమన్వయకమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కోటి సంతకాల కాగితాలను ఈ నెలలోనే గవర్నర్‌కు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో కలిసి అందిస్తామన్నారు. నూతన ఏడాది నుంచి ప్రతి నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం పదేపదే కలుసుందాం అని చెప్పడంలోనే వారి డొల్లతనం బయట పడుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ రూ.2000 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. మరో రూ.600 కోట్లు ఫైనాన్స్ అటాచ్ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ సమన్వయకర్తలు ఒక మెట్టు దిగి అందరినీ కలుపుకుని వెళ్ళాలన్నారు. అధికారంలో ఉన్నప్పటికంటే వైఎస్ జగన్‌ను ఇప్పుడు మరింతగా ప్రజలు అభిమానిస్తున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు త్వరగా పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలన్నారు.
ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ సమష్టిగా కృషి చేస్తే వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నారు. ప్రజల్లో అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై ఎంతో అభిమానం ఉందన్నారు. రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీ విజయంలో అనుబంధ కమిటీల పాత్ర గొప్పదన్నారు. కమిటీలలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ ప్రసంగిస్తూ 18 నెలల పాలనలో చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గుర్నాథరావు మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. పార్టీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. నూజివీడు, ఏలూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మామిళ్ళపల్లి జయప్రకాష్, తెల్లం బాలరాజు, కంభం విజయరాజు, ఈసీ సభ్యులు గోపాలరావు పార్టీ కార్యక్రమాలను వివరించారు.
ఏకపక్షంగా కేసులు మాఫీ చేసుకున్న ఏకై క సీఎం చంద్రబాబే
దేశ రాజకీయాల్లో తనపై ఉన్న కేసులను ఏకపక్షంగా మాఫీ చేసుకున్న ఏకై క సీఎం చంద్రబాబునాయుడేనని, ఆయనకు నిజంగా దమ్ముంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సమావేశంలో బొత్స మాట్లాడుతూ చంద్రబాబు సాక్షులను, అధికారులను బెదిరించి కేసులను క్లోజ్ చేయించుకున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగంలోని చిన్న చిన్న సాంకేతిక మార్గాలను తనకు అనుకూలంగా మలచుకుని చంద్రబాబు ఆయనపై ఉన్న మద్యం దోపిడీ కేసు క్లోజ్ చేయించుకున్నారని మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్, అవసరమైతే కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. సీఎం తీరు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని దుయ్యబట్టారు.
బాబు ధనవంతుల కోసం ఆలోచిస్తాడు
చంద్రబాబు ధనవంతుల కోసం తప్ప పేదల కోసం ఎన్నడూ ఆలోచించడని బొత్స మండిపడ్డారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్ల అప్పు తెచ్చిన చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించడానికి రూ.6,000 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం కుదేలైందని, అప్పుల్లో మాత్రం టాప్‌లో ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తుపానులకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలన 18 నెలల్లో లైంగిక దాడులు, కిడ్నాప్‌లు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనతో పోల్చితే క్రైం రేటు ఎంతో పెరిగిందన్నారు. చంద్రబాబుకు పరిపాలనపై పట్టులేదన్నారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్లపాటు కలిసి ఉంటామనడం భ్రమ అని ఎద్దేవా చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు రాజీనామాలు చేసిన వారి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కొల్లేరు సమస్యను మానవీయ కోణంలో చూస్తున్నామని, అక్కడ పేదలకు న్యాయం చేయాలని పార్టీ సైతం భావిస్తోందని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ
నాయకుల్లో ఉత్సాహం నింపిన జిల్లా పార్టీ సమావేశం
తరలివచ్చిన నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు
ప్రతిపక్షంగా రాజీలేని పోరాటం


