ఏలూరు రూరల్: ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమితులైన క్రీడాకారుల సేవలను ఉపయోగించుకుంటామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. మంగళవారం ఆయన అల్లూరి సీతారామరాజు స్టేడియం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యాయామ ఉపాద్యాయులను డిప్యూటేషన్‌పై స్టేడియంలో తాత్కాలిక కోచ్‌లుగా నియమించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. 2026లో రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటుచేసి క్రీడాకారులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏలూరు జిల్లాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసి గ్రామీణ బాలబాలికలకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఏలూరు(మెట్రో): ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రుల పర్యటన సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞపులను పరిశీలించి పరిష్కరించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ప్రజల వ్యక్తిగత సమస్యలపై నిబంధనలు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు, జిల్లా సీఈఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి: పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని, నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పెదవేగిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన తగదన్నారు. నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా పెదవేగిలోని పాత ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో నూతన కర్మాగారం నిర్మించేందుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోళ్ళ అర్జునరావు, మెతుకుమెల్లి రాంబాబు, కూచిపూడి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని కై కలూరు, నగరంలోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తోన్న ఉత్తమ సిబ్బందికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సిబ్బందికి ఎస్పీ నగదు బహుమతులు అందించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ చేయించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్‌ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల ఫిట్‌నెస్ కోసం మచిలీపట్టణం, రాజమండ్రి, అమలాపురం లేదా తమకు దగ్గరలో ఉన్న ఏటీఎస్ సెంటర్‌లలో వాహన ఫిట్‌నెస్ చేయించుకోవాలని సూచించారు.
వ్యాయామ ఉపాధ్యాయులను కోచ్‌లుగా నియమిస్తాం
వ్యాయామ ఉపాధ్యాయులను కోచ్‌లుగా నియమిస్తాం


