కొయ్యలగూడెం: అక్రమ డీజిల్ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా అచ్యుతాపురం శివారు హైవే ప్రాంతం నిలయంగా మారింది. ఏలూరు జిల్లా సరిహద్దు, తూర్పుగోదావరి జిల్లా ప్రారంభం ప్రాంతంలో కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి రాకపోకలు సాగించే లారీల నుంచి డీజిల్‌ని కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేటు కంపెనీలకు చెందిన లారీలను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్లు క్లీనర్లను అక్రమ డీజిల్ విక్రయదారులు తమ దందా కొనసాగిస్తున్నారు. ఆయిల్ బంకుల్లో కంటే రూ.15 నుంచి రూ.20 మేర లారీ సిబ్బంది నుంచి తక్కువకు కొనుగోలు చేస్తారు. అనంతరం అదే డీజిల్ ని ఆయిల్ బంకులలోని ధర కంటే రూ.పది నుంచి రూ.15 తక్కువకు ఇతర వాహనదారులకు అక్రమ విక్రయిస్తూ డీజిల్ దందాదారులు లబ్ధి పొందుతున్నారు. ప్రతిరోజు రమారమి 200 లీటర్ల నుంచి 300 లీటర్లు మేర డీజిల్ విక్రయిస్తున్నారు. దీంతో లారీలు నిలిచిపోతుండడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ కలుగుతోందని వాహనదారులు గగ్గోలు చెందుతున్నారు. రెండేళ్లుగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దాడులు నిర్వహించిన సమయాల్లో డీజిల్ దందా దారులు భారీ మొత్తంలో మామూళ్లు సమర్పిస్తుండడంతో అంతా గుంభనంగా సాగిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యథేచ్ఛగా హైవేలో డీజిల్ దందా


