జంతు గణనకు సన్నద్ధం
న్యూస్‌రీల్
ప్రతి నాలుగేళ్లకూ గణన
కుక్కునూరు రేంజ్ పరిధిలో..
● పాపికొండల అభయారణ్యంలో గణన
● 1 నుంచి 8 వరకు ప్రక్రియ
● సాంకేతిక విధానం ద్వారా లెక్కింపు
● అటవీ సిబ్బందికి శిక్షణ పూర్తి
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలో పులులు, ఇతర జంతువుల గణనకు అటవీశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ ప్రాంతంలోని జంతువుల గణన ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి 8వ తేదీ వరకూ పాపికొండల్లో జంతువుల గణనను చేపట్టనున్నారు. గతంలో జంతువుల గణన పుస్తకాల్లో మాత్రమే నమోదు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి అత్యాధునిక సాంకేతికత విధానం ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. గణనలో పాల్గొనే సిబ్బందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియపై శిక్షణ కూడా ఇచ్చామన్నారు.
8 రోజులపాటు..
పాపికొండల అభయారణ్యంలో సుమారు 8 రోజులపాటు జంతు గణన ప్రక్రియ జరగనుంది. మొదటి మూడు రోజులు అటవీ శాఖ సిబ్బంది తమకు నిర్ణయించిన మూడు కిలోమీటర్ల పరిధిలో కాలినడకన తిరుగుతూ జంతువుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తిస్తారు. తదుపరి ఐదు రోజులు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార జంతువులను గుర్తిస్తారు. అలాగే జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటోలు తీయడంతోపాటు వారు సంచరించే సమయంలో జంతువుల పెంటికల్, పాదముద్రలను కూడా గుర్తిస్తారు. అడవుల్లో సంచరించే పశువుల కాపర్లతోపాటు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రజల నుంచి కూడా జంతువుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. జంతువులతోపాటు వారు పర్యటించే పరిసర ప్రాంతాల్లో ఏయే రకాల చెట్లు ఉన్నాయో అనే వివరాలను కూడా అటవీశాఖ సిబ్బంది నమోదు చేస్తారు.
1.12 లక్షల హెక్టార్లలో.. పాపికొండల అభయారణ్యం 1,12,500 హెక్టార్లలో విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలను కూడా గుర్తించారు. ఈ అభయారణ్యంలో ఎక్కువగా ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, ముళ్లపందులు, నక్కలు, ముంగీసలు, అడవి దున్నలు ఉన్నట్టు గుర్తించారు.
2022లో 116 ప్రాంతాల్లో..
పాపికొండల అభయారణ్యంలో 2018లో జంతుగణన నిర్వహించిన అధికారులు మరలా 2022లో జంతుగణన చేపట్టారు. పాపికొండల అభయారణ్యం పరిధిలో 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సింహాలు, ఏనుగులు తప్ప అన్నిరకాల జంతువులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి.
దేశవ్యాప్తంగా కార్యక్రమం : దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి చేపట్టనున్న జాతీయ పులుల గణన, వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం సుమారు 8 రోజులపాటు పాపికొండల అభయారణ్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా సర్వేకు సంబంధించిన ట్రయిన్ రన్‌కు కూడా అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు.
ప్రతి నాలుగేళ్లకోసారి అభయారణ్యాల్లో పులులు, జంతు గణన సర్వే జరుగుతుంది. ఈ మేరకు పాపికొండల అభయారణ్యంలో పులులు, జంతుగణన సర్వే చేయనున్నాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొదటి మూడు రోజులు కాలినడకన తిరుగుతూ పులులకు సంబంధించిన ఆనవాళ్లను సిబ్బంది గుర్తిస్తారు. మిగిలిన ఐదు రోజులు వన్యప్రాణుల జాడను గుర్తించడంతోపాటు చెట్లను కూడా గుర్తిస్తారు.
– ఎస్‌కే వలీ,
అటవీ శాఖ అధికారి, పోలవరం రేంజ్
కుక్కునూరు: కుక్కునూరు అటవీ శాఖ రేంజ్ పరిధిలో పులుల లెక్కింపు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు రేంజ్ అధికారి కృష్ణకుమారి ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏలూరు అటవీ విభాగంలో పాపికొండల నేషనల్ పార్క్ నార్త్ ఈస్ట్రన్ ఘాట్స్‌లో పులుల సంరక్షణకు చివరి ప్రధాన ఆశగా ఉండటంతో పాటు తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల పులుల నివాసాలను కలిపే ముఖ్యమైన కారిడార్‌గా పనిచేస్తోందన్నారు. గతంలో పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఉడతపల్లి, కొవ్వాడ, గెడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం గుర్తించారన్నారు. గణనకు సర్వసన్నద్ధంగా ఉండటంతో పాటు సిబ్బందికి సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు.
జంతు గణనకు సన్నద్ధం
జంతు గణనకు సన్నద్ధం
జంతు గణనకు సన్నద్ధం
జంతు గణనకు సన్నద్ధం


