అర్ధరాత్రి హత్య
● మహిళను వేధించాడంటూ యువకుడిపై ఘాతుకం
● స్నేహితుడే హంతకుడు
● తణుకులో ఘటన
తణుకు అర్బన్: నిద్రిస్తున్న యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ హత్య ఉదంతంతో తణుకు ప్రాంతం ఉలిక్కిపడింది. స్నేహితుల మధ్య ఒక మహిళ విషయంలో రేకెత్తిన అనుమానాలతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకులోని పైడిపర్రు గౌతమీ సాల్వెంట్ ప్రాంతంలోని సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న శిరాళం ప్రభాకర్ (28) ఇంట్లోకి వెళ్లిన కందుల శ్రీను, మిత్రుడు కాపకాయల శ్రీను సాయంతో కలిసి కత్తితో అత్యంత దారుణంగా దాడిచేయగా తీవ్రమైన రక్తస్రావం జరిగింది. దాడి తర్వాత నిందితులు తప్పించుకుపోగా వెంటనే కుటుంబసభ్యులు ముందుగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఆపై మెరుగైన వైద్యసేవలకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణం లేదని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
ఇద్దరూ స్నేహితులే..
సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న ప్రభాకర్, శ్రీను స్నేహితులు కావడంతోపాటు ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. అయితే శ్రీను బంధువు అయిన ఒక మహిళను వేధిస్తున్నాడనే అనుమానంతో ప్రభాకర్‌తో ఇటీవల వాగ్వాదం జరిగింది. దీంతో ప్రభాకర్ తనకు ప్రాణ హాని ఉందంటూ రూరల్ పోలీసులను సైతం ఆశ్రయించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు పంపించగా శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి ఇంకా వివాహం కాకపోగా తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి శిరాళం చిన్నారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన శ్రీనుతోపాటు సహకరించిన మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో మృతుడి పక్కనే ఉన్న సోదరుడు కూడా నిందితులపై ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది.
చెప్పినట్లే చంపేశాడు
ఇద్దరి మధ్య ఏర్పడ్డ తగాదాల అనంతరం ఎలాగైనా కానీ ప్రభాకర్‌ను చంపేస్తానని శ్రీను బాహాటంగానే హెచ్చరించేవాడని, అతను చెప్పినట్లుగానే చంపేశాడని మృతుడి తల్లి చిన్నారి కన్నీళ్ల పర్యంతమయ్యారు. తనను చంపేస్తాడేమోనని ప్రభాకర్ భయపడినా అంతకు తెగిస్తాడని ఊహించలేదంటూ ఘొల్లుమన్నారు. హత్యకు పాల్పడిన కందుల శ్రీనుకు గతంలో కూడా నేరచరిత్ర ఉందని బాధిత వర్గాలు చెబుతున్నారు. గంజాయి తదితర వ్యవహరాల్లో పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి పో స్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. హత్య ఘటన తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తణుకు వ చ్చి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తణుకు సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై చంద్రశేఖర్‌లు పంచనామా, పోస్టుమార్టంను పర్యవేక్షించారు.
అర్ధరాత్రి హత్య


