మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తణుకు అర్బన్: పేదలకు నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటుకు కట్టబెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు ఉమెన్స్ కళాశాల ప్రాంతంలో శనివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన మాట్లాడారు. పేదవర్గాలకు ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గుండె, కిడ్నీ, లివర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందుతాయని, పేదలకు అందని ద్రాక్షగా ఉండే వైద్యవిద్య కూడా చేరువవుతుందన్నారు. అయితే వైద్యం, వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే దుర్భుద్ధితో మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయా లని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పేదల అనారోగ్య సమస్యలకు అప్పులపాలైపోతున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలంలో పేదలకు ప్రభుత్వ వైద్యం గండంగా మారిందని, ఆరోగ్యశ్రీని సైతం అటకెక్కించారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులవుతున్నారని, కోటి సంతకాల ప్రతులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కు చేరుతాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కానివ్వమని కారుమూరి అన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్‌సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, తణుకు పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు పెనుమాక రాజేష్, గెల్లా జగన్, పి.దొరబాబు, షేక్ బాజీ, పైడి సాయిసూర్య, ఎడ్వర్డ్ పాల్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి


