వైకల్య నివారణకు జాగ్రత్తలు అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పిల్లల్లో వైకల్యాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సభ్యులు సూచించారు. నగరంలోని దొండపాడు ఉమా ఎడ్యుకేషన్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ప్రతినిధులు శనివారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. దగ్గరి రక్త సంబంధీకులతో వివాహం వద్దని, 18 సంవత్సరాలలోపు బాల్య వివాహాలు వద్దన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులు 21 రకాలుగా గుర్తించారని, ప్రభుత్వం దివ్యాంగులకు అందించే హక్కులను వివరించారు. వైకల్య నివారణకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైకల్యం ముందుగా గుర్తించడం, వైకల్యం వచ్చిన తర్వాత దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులను కల్పించిందని, వాటిని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 08812 –249297,7386565469 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు అల్లూరి రవి ప్రకాష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెంటపాడు: మోంథా తుపాను రైతులను నిండా ముంచింది. అప్పులు చేసి పండించిన పంట రైతు చేతికి అందకుండా ముంచేసింది. పూర్తిగా చేలు నేటనంటాయి. తాడేపల్లిగూడెం మండలంలో 46 వేల ఎకరాలకు పంట పూర్తిగా చేతికి దక్కినా, పెంటపాడు మండలంలో 22 వేల ఎకరాలకు గాను 40 శాతం పైగా వరి పంట నేలకు ఒరిగింది. ఇందులో అఽఽధిక భాగం స్వర్ణ రకం వరి.. ఈ వరి కొద్దిపాటి గాలికే నేలకొరుగుతుంది. అదృష్టవశాత్తూ చేలలో నీరు తక్కువగా ఉండడం, ఎగువభాగంలో కాలువలు కట్టేయడంతో రైతులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. పెంటపాడు మండలంలో ప్రధానంగా కె. పెంటపాడు, రావిపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, జట్లపాలెం, యానాలపల్లి గ్రామాలలో తుపాను ప్రభావం వల్ల పంట చేలు నేలకు ఒరిగాయి. బీమా సొమ్ము కూడా పూర్తిగా కట్టించుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీమా సొమ్ము ప్రభుత్వం కట్టేది. ఈ సారి రైతులే కట్టుకోవాలని అని చెప్పడంతో ఎక్కువశాతం రైతులు బీమా సొమ్ము కట్టలేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా ఉన్నాయి. మరోవైపు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు హడావుడిగా మాసూళ్లు చేస్తున్నారు. యంత్రం ద్వారా కోసిన ధాన్యం ఆరబెడుతున్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా రవాణా శాఖ అధికారి కొలుసు సాయి మురళీ వెంకట కృష్ణారావు ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో స్కూల్, కాలేజీ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. శనివారం అసిస్టెంట్ మోటార్ హెవికల్ ఇన్స్‌పెక్టర్లు బస్సుల ఫిట్‌నెస్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా బస్సులు తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 347 బస్సులను తనిఖీ చేసి.. వాటిలో 140 బస్సుల్లో భద్రత లోపాలు గుర్తించి నోటిసులు జారీ చేశామన్నారు. రెండు బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా భీమవరం పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, విద్యార్థులకు రోడ్డు భద్రతా జాగ్రత్తలు, డ్రైవింగ్ లైసెనన్స్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
వైకల్య నివారణకు జాగ్రత్తలు అవసరం


