
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు
వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్‌కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్‌ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్‌లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్‌లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు.