జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బస్సులు ఇటీవల మార్గమధ్యలో ఆగిపోతుండడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు ఆర్టీసీ అంటనే హడలెత్తిపోతున్నారు. తరచూగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ అధికారులు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం లేదని, బస్సులకు సరైన మరమ్మతులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రయాణం నరకప్రాయం
ఏపీఎస్ ఆర్టీసీ అంటే పేద, బడుగు, బలహీన వర్గాల సొంత వాహనంగా పేరుంది. కాని నేడు ఆ బస్సుల్లో ప్రయాణించాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ తరచుగా బస్సులు బ్రేక్‌డౌన్ కావడంతో ఉచిత బస్సు ప్రయాణం దేవుడెరుగు, కనీసం మంచి కండీషన్‌లో ఉన్న బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆమ్మో ఆర్టీసీ
● ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నుంచి పెదవేగి మండలం కొండలరావుపాలెం పెళ్లి నిమిత్తం పెళ్లివారు బస్సును మాట్లాడుకున్నారు. మార్గమధ్యలో వడ్లపల్లి వద్ద బస్సు ఆగిపోయింది. దీంతో పెళ్లి సమయానికి బంధువులు వెళ్లలేకపోయారు. కాలం చెల్లిన బస్సులు పెళ్లి వారికి పంపించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.
● జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆగిపోయింది. డ్రైవర్ గేరు మార్చుతుండగా గేర్ రాడ్ ఊడి డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది. దీంతో బస్సు ఆగిపోయింది. రాత్రి సమయంలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అరగంట తర్వాత జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన మరో బస్సులో ప్రయాణికులు ఏలూరు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు.
మొరాయిస్తున్న బస్సులతో అవస్థలు