
జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం నిర్వహణ పనుల నిమిత్తం రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మైనర్ ఇరిగేషన్ ఏఈ టి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నిధులతో గేట్లు, రంగులు వేయడం, ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, ఆయిల్, గ్రీజు పనులు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు, గతంలో రూ. 8 లక్షల వ్యయంతో స్పిల్‌వే గేట్లు మరమ్మతులు కూడా పూర్తి చేశామని తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి
బుట్టాయగూడెం: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది, కృషి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ సాల్మన్‌రాజు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో ప్రజలకు అందించే సేవలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తీరు మార్చుకుని సక్రమంగా పని చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 9.2 మిలియన్ యూనిట్‌ల కరెంట్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రీవెంప్‌డ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో 3 ఫేస్ కరెంట్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో నూతనంగా 24 సబ్‌స్టేషన్‌లతోపాటు 5 నుంచి 10 పవర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి వినియోగదారుల కోసం పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకంలో వినియోగదారులు తమ విద్యుత్‌ను తామే తయారు చేసుకునే విధంగా ఇళ్లపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారన్నారు. ఇప్పటివరకూ 2600 యూనిట్‌లను రిలీజ్ చేశామని ఈ పథకం అమలులో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.

జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం