
సొసైటీ కార్యాలయానికి తాళాలు
టి.నరసాపురం: డిపాజిట్లు చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు టి.నరసాపురం సహకార సంఘ కార్యకలాపాలను గురువారం స్తంభింపజేశారు. కార్యాలయ సిబ్బందిని బయటకు రప్పించి వారితోనే సంఘ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి డిపాజిట్లు చెల్లించేవరకు తమ నిరసన కొనసాగుతుందని, సంఘ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. టి.నరసాపురం సహకార సంఘంలో అవకతవకలు బయట పడటంతో రెండేళ్ల క్రితం సహకార సంఘ పాలకవర్గాన్ని తొలగించి అప్పటి సీఈవోను సస్పెండ్ చేశారు. కొద్ది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ అధికారులను త్రిసభ్య కమిటీగా నియమించి సంఘ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 370 డిపాజిట్లకు సంబంధించి రూ.15 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు ఆ బాండ్లకు సంబంధించి మెచ్యూరిటీ సొమ్ము చెల్లించడం గాని, బాండ్లు క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము చెల్లించడం గాని, ఎస్‌బీ ఖాతాల్లో ఉన్న సొమ్ము నిల్వలు చెల్లించడం గాని చేయడం లేదు. గత మార్చి వరకు డిపాజిట్ల సొమ్మును బాకీదారుల బకాయిల్లో జమ చేసుకునేవారు. ఏప్రిల్ నుంచి ఆ డిపాజిట్ల సొమ్మును కూడా బాకీలకు జమ చేసుకోవడం నిలిపివేశారు. దాంతో ఆగ్రహించిన రైతులు తమ డిపాజిట్ల సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు కార్యాలయ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. సీఈవో అగస్టీన్ మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, మరోసారి ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు.
టి.నరసాపురం సొసైటీ వద్ద రైతుల నిరసన
డిపాజిట్ల సొమ్ములు చెల్లించడం లేదని ఆగ్రహం