
ఐచ్ఛిక సెలవులకు అనుమతి ఇవ్వండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5వ తేదీన మొహర్రం, అక్టోబర్ 9న యజ్‌దహుకు షరీఫ్, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డేలను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలువులు తీసుకునేందుకు అనుమతులివ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్ జీ మోహన్‌రావు, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, ఫ్యాప్టో నాయకులు ఆర్.రవికుమార్, టీ రామారావు, సీహెచ్ శివరామ్ తదితరులున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఏలూరు (టూటౌన్): హాస్టల్‌లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ వై.విశ్వమోహాన్ రెడ్డి ఆదేశించారు. ఏలూరు నగరంలోని బాలికల హాస్టల్ నెంబర్ 1 ను గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వసతులను, విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్లో సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డ్రాప్ ఔట్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు.
డ్రాపవుట్స్‌ను పాఠశాలల్లో చేర్పించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, అధికారులపై కూడా ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలుపై జిల్లాస్థాయి అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. డ్రాపవుట్స్‌కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు 95333 99981 నంబరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పంటల బీమా పథకంపై అవగాహన
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినపుడు రైతును ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో సార్వా 2025కి వరి పంటకు గ్రామ యూనిట్‌గా, మినుములు పంటకు జిల్లా యూనిట్‌గా, పత్తి యాసిడ్ లైన్ పంటలకు మండల యూనిట్‌గా పంట బీమా అమలు చేయడం జరుగుతుందన్నారు.
నేడు మునిసిపల్ కార్మికుల మహాధర్నా
ఏలూరు (టూటౌన్): విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న మహాధర్నాకు మునిసిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, పారిశుద్ధ్య విభాగం వారికి 17 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ఈ మహాధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటన
భీమవరం (ప్రకాశంచౌక్): స్వచ్ఛ సర్వేక్షన్ ఉత్తమ పంచాయతీలు ఎంపికలో భాగంగా జిల్లాలో 25 గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సెంట్రల్ టీం పర్యటిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున జిల్లాలోని 25 గ్రామాల్లో 20 రోజులు ఈ బృందం పర్యటిస్తోందన్నారు.

ఐచ్ఛిక సెలవులకు అనుమతి ఇవ్వండి