
త్వరలో పోలీస్ అకాడమీ సెంటర్‌కు శంకుస్థాపన
ఆగిరిపల్లి: పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం బుధవారం మండలంలోని నూగొండపల్లి గ్రామంలో ఉన్న 94.49 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూగొండపల్లిలో పోలీస్ శిక్షణ సదుపాయాల కోసం త్వరలో అధునాతన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ అకాడమీ సెంటర్ రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, డీఐజీలు జీవీజీ అశోక్ కుమార్, ఎం.రవి ప్రకాష్, సత్య ఏసుబాబు, ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.
నేడు రౌండ్ టేబుల్ సమావేశం
ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజల సమస్యలపై ఈనెల 3న విజయవాడలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు బి.బలరాం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు విజయవాడ రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న బాలోత్సవ భవనంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌టీయూ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బదిలీ అయినా.. రిలీవర్ లేక పాత స్థానాలలోనే కొనసాగుతున్న వివిధ కేడర్ల ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయ విధానాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సెలవు పెట్టుకునే విషయంలో పెట్టిన సమయ నిబంధనలు సవరించాలన్నారు. నోట్‌బుక్స్‌తో పాటు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి బీ.త్రినాథ్ ఉన్నారు.
ముగిసిన డీఎస్సీ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వివిధ పరీక్షా కేంద్రాల్లో చివరి రోజు బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 961 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్ పరీక్షలకు 180 మందికి 177మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 180 మందికి 168 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్‌లో 140 మందికి 136 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 140 మందికి 133 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 194 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 156 మందికి ను 153 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రారంభమై నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 17386 మందికి 16154 మంది పరీక్షలు రాయగా 1232 మంది గైర్హాజరయ్యారు.
నేడు మహిళా కమిషన్ చైర్మన్ పర్యటన
ఏలూరు(మెట్రో): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ నేడు జిల్లాలో పర్యటిస్తారు. ముసునూరు, ఏలూరు, దెందులూరులో ఆమె పర్యటన ఉంటుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శిస్తారు.