ప్రజాతీర్పుకు పట్టం కట్టాలి!

Sakshi Editorial On Thailand Elections Voting

అణిచివేత ఎక్కువైనప్పుడు ఆగ్రహం వస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు మార్పును కోరుతూ ప్రజా సందేశాన్ని మోసుకొస్తుంది. ఆదివారం థాయిలాండ్‌లో జరిగిన ఎన్నికల ఓటింగ్‌ సరళి అందుకు తాజా ఉదాహరణ. సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న, మరోమాటలో సైన్యమే తొమ్మిదేళ్ళుగా నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది.

మార్పు కోరుతూ థాయిలాండ్‌ ఓటర్లు తీర్పునిచ్చారు. అలా 2020లో విద్యార్థుల నేతృత్వంలో సాగిన ప్రజాస్వామ్య అను కూల భారీ నిరసన ఉద్యమాల తర్వాత జరిగిన తొలి జనరల్‌ ఎలక్షన్‌ ఫలితం అపూర్వం. దేశ రాజకీయాల్లో మిలటరీ, రాయల్టీ ప్రాబల్యాన్ని సామాన్యులు నిరసించడం అక్కడి ప్రజాస్వామ్యవాద శక్తులకు సంతోషకరమే. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులందరికీ గుణపాఠమే. 

6.5 కోట్ల జనాభా గల థాయిలాండ్‌లో 5.2 కోట్ల మందికి ఓటు హక్కుంది. రానున్న నాలుగేళ్ళ కాలానికి 500 స్థానాల ప్రజా ప్రతినిధుల సభకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సుమారు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఛాయిస్‌ ఏమిటో చెప్పేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలైన ఫ్యూథాయ్, మూవ్‌ ఫార్వర్డ్‌ పార్టీలు రెండూ అధికార పార్టీని మట్టి కరిపించాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల శిబిరాలు విజయం సాధిస్తాయని ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణల నుంచి ఊహిస్తున్నదే. కానీ, ఈ స్థాయి విజయం అనూహ్యం, అద్భుతమే.

పట్టణప్రాంతాల్లో పట్టున్న, ప్రగతిశీల ‘మూవ్‌ ఫార్వర్డ్‌’ 151 స్థానాలతో అగ్రపీఠిన నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పదవీచ్యుత ప్రధానమంత్రి తక్షిణ్‌ శినవాత్ర తరఫున జనాకర్షక రాజకీయ పక్షమైన ‘ఫ్యూథాయ్‌’కి 141 స్థానాలు రావచ్చని లెక్క. అయితే, అధికార శక్తులు ఈ ఫలితాలను అంగీకరించి, ఈ సంస్కరణవాద పార్టీలు ప్రభుత్వం ఏర్పరిచేలా గద్దెను అప్పగిస్తాయా అన్నదే ప్రశ్న.

గత∙రెండు దశాబ్దాల్లో స్వేచ్ఛగా ఎన్నికలైన ప్రతిసారీ తక్షిణ్‌ నేతృత్వంలోని పార్టీలు గెలుస్తూ వచ్చాయి. సైన్యం మాత్రం కోర్టు జోక్యంతోనో, తిరుగుబాట్లతోనో వారిని పదే పదే అధికారానికి దూరం పెడుతూ వచ్చింది. నిండా 36 ఏళ్ళ తక్షిణ్‌ కుమార్తె ఇంగ్లక్‌ ఇప్పుడు ‘ఫ్యూథాయ్‌’ పార్టీని నడుపుతున్నారు. అయితే, వారసత్వ రాజకీయాలతో విసిగిన లక్షలాది తొలి యువ ఓటర్లు ‘మూవ్‌ ఫార్వర్డ్‌’ వైపు మొగ్గడంతో, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి.

విదేశాల్లో చదివి, వ్యాపార నిమిత్తం తిరిగొచ్చి, సైనికపాలన, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న 42 ఏళ్ళ పిటా లిమ్జాయోన్రత్‌కు ఎన్నికల్లో జనం జై కొట్టారు. ఈ నేతలిద్దరూ సైన్యానికి ఎదురొడ్డిన ధనిక వ్యాపార కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇక, చిన్నాచితకా ప్రతిపక్షాలు సైతం ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషమే.

ఈ ప్రజాస్వామ్య అనుకూల పార్టీలన్నీ కలసి సంకీర్ణ సర్కార్‌గా పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయట. అలా అన్నీ ఒక తాటిపైకొస్తే సైనిక పాలన, రాచరికపు అపరిమిత అధికారాలకు చరమగీతం పాడాలన్న జనం కోరిక నెరవేరుతుంది. 

కానీ, పార్టీలు అనుకున్నంత మాత్రాన జరగాలని లేదు. 2019 ఎన్నికల్లో నేటి ‘మూవ్‌ ఫార్వర్డ్‌’ పార్టీ ముందస్తు రూపం ‘ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌’ మూడోస్థానంలో నిలిచింది. తీరా పార్టీ సారథిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. పార్టీ రద్దయింది. ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తున్న ‘మూవ్‌ ఫార్వర్డ్‌’ నేత పిటాకు సైతం ఎన్నికైన ఎంపీల మద్దతుతో పాటు సైన్యం నియమించిన సెనేటర్ల మద్దతు అవసరం.

ఎన్నికల్లో గెలిచినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరం కావడమే థాయ్‌ లోని విచిత్రం. ఇదంతా ఎన్నికల్లో గెలిచిన పార్టీల అధికారాన్ని సైతం తటస్థీకరించేలా, సెనేట్‌ను నియమిస్తూ 2017లో రాజ్యాంగాన్ని సైన్యం తిరగరాసిన ఫలితం. 2014లో జనరల్‌ ప్రయూత్‌ చాన్‌ – ఓచా అప్పటి పౌరప్రభుత్వాన్ని పడదోసి, సైన్యం, రాయలిస్ట్‌ పార్టీలు, రాచరికపు అండతో తనను తాను ప్రధానిగా నియమించుకున్నారు. న్యాయవ్యవస్థ సహా అన్నిటినీ విధేయులతో నింపేశారు.

ఇటు నిరుపేద థాయ్‌లను ఆకర్షించే ఫ్యూథాయ్‌ పార్టీ అన్నా... అటు నిర్బంధ సైనిక శిక్షణ, రాజు – రాణులను పల్లెత్తు మాటన్నా 15 ఏళ్ళ దాకా జైల్లోకి నెట్టే కఠినమైన ‘లెస్‌–మాజెస్టీ’ చట్టాలకు చరమగీతం పాడతానంటున్న మూవ్‌ ఫార్వడ్‌ పార్టీ అన్నా... సహజంగానే సైన్యానికి గిట్టదు. కానీ, రాచరిక అనుకూల చట్టాలను మారుస్తానంటున్న పార్టీకి నవతరం థాయ్‌ ప్రజలు జేజేలు పలకడం ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రజాస్వామ్య మార్పు పవనాలకు సూచన.

ఇది గ్రహించి సంప్రదాయ శక్తులు పట్టు సడలిస్తాయా? జనం ఎన్నుకున్న 500 సభ్యుల ప్రతినిధుల సభతో పాటు పాలక సైనిక వర్గమే నియమించిన 250 మంది సభ్యుల సెనేట్‌కూ ప్రధాని ఎంపికలో ఓటు ఉండడమే విషాదం. అంటే ఎన్నికల్లో పెల్లుబికిన ప్రజాస్వామ్య వెల్లువను సైతం సైన్యం పరోక్షంగా తొక్కేసే ముప్పుంది. 

ఇన్నేళ్ళుగా దేశాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్న సైనిక జనరల్స్‌ తాజా ప్రజా తీర్పును గౌరవించాలి. అధికారాన్ని గెలిచిన పార్టీలకు అప్పగించి, సైనిక విధులకు పరిమితం కావాలి. ఆ పని చేయక, ప్రజాకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది థాయిలాండ్‌కే మంచిది కాదు.

పొరుగునే మయన్మార్‌లో 2020 నవంబర్‌ ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూక్యీ అఖండ విజయం సాధించినా, మూడునెలల్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకొని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశంలా థాయ్‌లాండ్‌ తయారు కాకుండా ప్రపంచ దేశాలూ జాగరూకత వహించాలి. అప్పుడే థాయ్‌ ప్రజలు గెలిచినట్టు, అక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top