
వైభవంగా అధ్యయనోత్సవాలు
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం పారాయణ నిర్వహించారు. ఆళ్వారులు, సుదర్శనాళ్వారులతో నిర్వహించిన తిరువీధి ఉత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. తిరువీధి వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఉప ముఖ్య అర్చక స్వామి గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కె.కృష్ణమాచార్యులు, ఎస్‌టీపీ రామానుజాచార్యులు, సీవీఎస్ సాయిరామ్, ఎస్.వెంకటాచార్యులు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ఈఓ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
ముద్రగడకు జగ్గిరెడ్డి పరామర్శ
కొత్తపేట: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంకు ఉన్నత వైద్యం అందుతుందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. అస్వస్థతకు గురై రెండు రోజుల పాటు కాకినాడ మెడికోవర్ ఆస్పత్రిలో వైద్యం పొందిన ముద్రగడను ఉన్నత వైద్యం నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న పద్మనాభంను మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కలిశారు. ముద్రగడకు ఒకపక్క చికిత్స జరుగుతుండగానే జగ్గిరెడ్డి కొద్దిసేపు ఆయనతో గడిపి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముద్రగడకు ప్రత్యేక బృందం వైద్యం అందిస్తుందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై
అపోహలు వద్దు
అమలాపురం రూరల్: విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటివల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లను వేసే ముందు వాటి ప్రత్యేకతలు, ప్రయోజనాలపై విద్యుత్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ముమ్మిడివరం: రామచంద్రపురం రాజా కాక్ షాట్ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ (గణితం)–1, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)–1, ఎస్జీటీ (తెలుగు)–2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు.
పే చానళ్ల ధరలు
తక్షణమే తగ్గించాలి
రావులపాలెం: ప్రస్తుతం పెరిగిన కేబుల్ ధరలు తక్షణమే తగ్గించాలని, ఉమ్మడి జిల్లాలోని మండల స్థాయి నుంచి ఆపరేటర్లు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అన్నారు. రావులపాలెంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జిల్లా అధ్యక్షుడు కర్రి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కన్వీనర్ రమ్మీ సురేష్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. ఎంఎస్‌ఓలు, బ్రాడ్ కాస్టర్ల రేట్లు తగ్గించకపోతే కేబుల్ ఆపరేటర్లు సమష్టి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చానళ్ల నియంత్రణపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ఆపరేటర్ నష్టపోకుండా ఉండేలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిర్ణయా లు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో హైదరాబాద్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సంఘ సెక్రటరీ ఎం.లక్ష్మీప్రసాద్, కోశాధికారి ఇ.గోవిందు రాయులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా అధ్యయనోత్సవాలు