
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర
అమలాపురం టౌన్: జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర సూచించారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటరులో వైద్యాధికార్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు తదితర విభాగాల సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో డాక్టర్ దుర్గారావు దొర మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మాతా శిశు సేవలను విస్తృతం చేసి ఆ వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, ప్రసవాల సంఖ్య నమోదు, టీకాల కార్యక్రమం, ఎన్‌సీడీసీడీ వంటి కార్యక్రమాల ప్రగతిపై డీఎం అండ్ హెచ్‌వో సమీక్షించారు. ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యనగేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఎం. మణిదీప్, డాక్టర్ శ్రీపూజ, డాక్టర్ బి.శిరీష, హెల్త్ సూపర్‌వైజర్లు ఎ.లక్ష్మి, సంపూర్ణ, అనూరాధ, డివిజనల్ సూపర్‌వైజర్ రాధా నరసింహం పాల్గొన్నారు.
అర్జీలను పరిష్కరించాలి
అమలాపురం రూరల్: అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా జవాబుదారీ తనంతో పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు మధుసూదన్, జయచంద్ర గాంధీ, ఎస్‌డీసీ కృష్ణమూర్తి, డీఎల్‌డీ ఓ రాజేశ్వరరావు అర్జీదారుల నుంచి సుమారు 200 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 24 వినతులు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఆ వేదికకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ అక్కడికక్కడే విచారించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు తక్షణమే స్పందించడమే కాకండా వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎప్పీ ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యాక ఆ నివేదికను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంఽధించిన ఫిర్యాదులపై ఎస్పీ అర్జీదారులతో చర్చించారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సోమవారం ఆమె సందర్శించారు. జైలులో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎవరైనా ఖైదీలు న్యాయ సహాయం కావాలని అనుకుంటే సంస్థ నియమించిన పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు. ముద్దాయిలు, ఖైదీల కోసం పని చేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని శ్రీలక్ష్మి అన్నారు.