నదీ పాయలో బాట నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నదీ పాయలో బాట నిర్మాణం

Mar 20 2025 12:05 AM | Updated on Mar 20 2025 12:05 AM

నదీ పాయలో బాట నిర్మాణం

నదీ పాయలో బాట నిర్మాణం

పి.గన్నవరం: పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి లంక వరకూ సుమారు 2 కి.మీ మేర నదీపాయలో తువ్వ మట్టి లారీల రాకపోకల కోసం పొక్లెయిన్లతో బాటలు నిర్మిస్తున్నారు. నేషనల్‌ హైవే పనుల కోసం తువ్వ మట్టిని తరలించేందుకు ఈ బాటలు ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్న నిర్వాహకులు మాత్రం వాటిని ఎవ్వరికీ చూపడం లేదు. ఇంతవరకూ స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా అనుమతి పత్రాలు అందలేదు. కూటమి నేతల కనుసన్నల్లో మట్టి తరలింపునకు సన్నాహాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మూతపడిన ర్యాంపు!

ఇటీవల పెదకందాలపాలెం నుంచి అనుమతులు లేకుండా కూటమి నాయకులు ఇసుక, మట్టిని కొల్లగొట్టడంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఈ ర్యాంపు మూతబడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి పల్లిపాలెం లంక వరకూ నదీపాయ వెంబడి పొక్లెయిన్లతో బాటలు వేస్తున్నారు. అనుమతులు లేకుండా టిప్పర్లలో తువ్వ మట్టిని తరలించుకుపోతున్నారని బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్‌ఐ వి.డాంగే, వీఆర్వో వి.సత్యనారాయణ ర్యాంపులోకి వెళ్లారు. నేషనల్‌ హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతులు తెచ్చుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాంపులోకి వెళ్లే ముందు రోడ్డుపై మట్టి లోడుతో వెళ్తున్న లారీని అధికారులు నిలిపి వీఆర్‌ఏని కాపలా ఉంచారు. ఈలోగా ర్యాంపు నిర్వాహకులు అక్కడికి వెళ్లి బిల్లు ఉందంటూ లారీని పంపించేశారు. ఈ క్రమంలో స్వల్ప వివాదం కూడా జరిగింది. ఇలాఉండగా మానేపల్లిలంక నుంచి మట్టిని తీసే అనుమతులతో.. పెదకందాలపాలెం లంక పరిసరాల్లో కూడా పెద్దఎత్తున మట్టిని తరలించుకుపోయేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే నదీపాయలో రెండు కి.మీ. మేర బాట నిర్మించారని చెబుతున్నారు.

అనుమతి పత్రాలు రావాలి

మానేపల్లి లంక నుంచి హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్టు మైన్స్‌ అధికారులు తనకు చెప్పారని తహసీల్దార్‌ పి.శ్రీపల్లవి తెలిపారు. వారి నుంచి సంబంధిత పత్రాలు రావాల్సి ఉందన్నారు.

మానేపల్లిలంక వద్ద పొక్లెయిన్లతో

2 కి.మీ. ఏర్పాటు

కూటమి నేతల కనుసన్నల్లో

ర్యాంపు నిర్వహణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement