
ప్రశాంతంగా ప్రారంభం
టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, బందోబస్తుపై ఆయన చర్చించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బందోబస్తు ఉండాలని సూచించారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గింపు, నేర పరిశోధనలో అధునాతన సాంకేతిక సహకారంతో మరింత ముందుకు వెళ్లడంపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించారు. మహిళల భద్రత కోసం నిర్వహిస్తున్న శక్తి యాప్‌పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. చోరీలు, రికవరీలు, అరెస్ట్‌లు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, రఘువీర్, సుంకర మురళీమోహన్, స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాస్, జిల్లా ఐటీ కోర్, క్రైమ్ విభాగాల సిబ్బంది, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వీరు పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిళ్లు, స్టేషన్ల వారీగా క్రైమ్ నివేదికను ఎస్పీకి వివరించారు.
● తొలి రోజు టెన్త్ పరీక్షలకు
18,942 మంది హాజరు
● పరీక్ష కేంద్రాల్లో అధికారుల తనిఖీలు
రాయవరం/ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి 8.30 గంటలకే విద్యార్థులు తమతమ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డులో ప్రదర్శించిన హాల్ టికెట్ నంబర్లు చూసుకుని తమకు కేటాయించిన రూముల్లోకి వెళ్లారు. విద్యార్థి దశలో తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు కావడంతో పలువురు కాస్త టెన్షన్ ఫీలయ్యారు. పలువురు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వరకూ కూడా పుస్తకాలతో కుస్తీ పట్టడం కనిపించింది. పరీక్షలు బాగా రాయాలంటూ పరస్పర్ విషెస్ చెప్పుకొన్నారు. పలువురు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు తమ ఇష్టదైవాల ఆలయాల్లో పూజలు చేశారు.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష జరిగింది. తొలి రోజు తెలుగు, సంస్కృతం పరీక్షను 19,046 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 104 మంది గైర్హాజయ్యారు. 18,906 మంది రెగ్యులర్, 36 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 99 శాతం మంది హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) డాక్టర్ సలీం బాషా తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. చాలాచోట్ల కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను తమ పాఠశాల వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాయి. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. విద్యార్థుల వెంట ఉండి చివరి నిమిషం వరకూ తగు సూచనలిస్తూ కనిపించారు. పరీక్ష విధులకు హాజరైన చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లను సెల్‌ఫోన్లతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష ప్రారంభం కాగానే తల్లిదండ్రులను, ఇతరులను పోలీసులు ఆయా కేంద్రాలకు దూరంగా పంపించేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
ఆకస్మిక తనిఖీలు
పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, ఇన్‌ఫ్రా జేడీ, పదో తరగతి పరీక్షల జిల్లా పరిశీలకుడు మువ్వా రామలింగం, డీఈఓ డాక్టర్ బాషా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశాయి. వీరు మొత్తం 51 కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు.
ప్రశాంతంగా నిర్వహించాలి
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వహణాధికారులను జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ ఆదేశించారు. అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తరగతి గదుల్లోకి స్వయంగా వెళ్లి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై ప్రధానోపాధ్యాయుడు, సీఎస్ కె.ఘన సత్యనారాయణకు, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు ఇచ్చారు.
కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని
పరిశీలిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

ప్రశాంతంగా ప్రారంభం

ప్రశాంతంగా ప్రారంభం

ప్రశాంతంగా ప్రారంభం