
పెళ్లి అంటే రూ.లక్షల ఖర్చుతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా భారతీయ వివాహాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. పెళ్లి భోజనాలు ఎంత ఘనంగా వడ్డిస్తారో ఆ పెళ్లికి వచ్చే కానుకలూ అంతే ఘనంగా ఉంటాయి. రూ.లక్షల్లో బహుమతులు చేతికందుతాయి. మరి వీటికి పన్ను ఉంటుందా? చెప్పకుండా దాచేస్తే ఆదాయపు పన్ను శాఖ కనిపెడుతుందా?
పెళ్లి సందర్భంలో వచ్చే కానుకలపై పన్ను అంశం పన్ను చట్టంలో స్పష్టంగా నిర్వచించారు. ఇది ఎవరికి వస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎంత మొత్తం వస్తోంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా అహ్మదాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఇచ్చిన తీర్పు స్పష్టతను తీసుకొచ్చింది. ఈ తీర్పు ప్రకారం, పెళ్లి సందర్భంలో వచ్చిన బహుమతులు, డాక్యుమెంటేషన్ సరైనదైతే, పన్ను మినహాయింపు పొందవచ్చు.
పెళ్లి కానుకలపై పన్ను చట్టం ప్రకారం..
పెళ్లి జరిగే వ్యక్తి అంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురుకి వచ్చిన బహుమతులు (నగదు లేదా ఇతరం) ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం పన్ను మినహాయింపు పొందుతాయి.
పెళ్లి జరిగే వ్యక్తి కాకుండా ఇతరులు అంటే వారి తల్లిదండ్రులు, తోడబుట్టినవారు పెళ్లి కానుకలు అందుకుంటే వాటికి సరైన డాక్యుమెంటేషన్ ఉంటేనే పన్ను మినహాయింపు ఉంటుంది. సాధారణంగా రూ.50,000కు మించి వచ్చిన బహుమతులను పన్ను వర్తించే ఆదాయంగా పరిగణిస్తారు.
ఇటీవలి ఐటీ ట్రిబ్యునల్ తీర్పు
గుజరాత్‌కు చెందిన మనుభాయ్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లికి రూ.4.31 లక్షల నగదు బహుమతులు స్వీకరించారు. అయితే ఇవి పెళ్లి తేదీ కంటే ముందే వచ్చాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ వీటిని "అస్పష్ట ఆదాయం"గా పేర్కొంటూ పన్ను విధించింది.
దీనిపై కోర్టుకు వెళ్లిన మొదట సీఐటీ (అపీల్స్) వద్ద కేసు కోల్పోయారు. తరువాత ఐటీఏటీ అహ్మదాబాద్ అప్పీల్ దాఖలు చేశారు. పెళ్లి ఆహ్వాన పత్రిక, అతిథుల జాబితా, వివాహ ధృవపత్రం వంటి ఆధారాలు సమర్పించారు. 2025 ఆగస్టు 12న ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రూ.4.31 లక్షల ఆదాయంపై పన్ను మినహాయించాలని ఆదేశించింది.
పన్ను చెల్లింపుదారులకు సూచనలు
పెళ్లిలో వచ్చిన బహుమతులకు రిజిస్టర్ నిర్వహించాలి (పేరు, మొత్తం, తేదీతో సహా). పెళ్లి ధృవపత్రాలు, ఆహ్వాన పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి. పెళ్లిలో కానుకలుగా వచ్చిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో మినహాయింపు ఆదాయంగా బహుమతులను ప్రకటించాలి. పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటే, పన్ను శాఖ ప్రశ్నించినా రక్షణ పొందవచ్చు.