
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు కూడా కొత్తరకం మోసాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన లేటెస్ట్ వాట్సాప్ స్కామ్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటి వరకు.. తెలియని వారు ఫోన్ చేసి బ్యాంక్ ఎంక్వైరీ అని లేదా తెలిసినవాళ్లమని చెబుతూ మోసాలకు పాల్పడేవారు. తాజాగా వెలుగులోకి వచ్చిన స్కాములో.. తెలియని నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేయడం వల్ల కూడా మోసపోతున్నట్లు తెలుస్తోంది. ఫోటో డౌన్‌లోడ్ చేయగానే.. అందులోనే మాల్‌వేర్ లేదా స్పైవేర్ ద్వారా మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం దొంగలించి, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దోచేస్తున్నారు. అంతే కాకుండా ఫోన్ వర్చువల్ కీబోర్డ్ (కీలాగర్)లో టైప్ చేసిన అన్ని పాస్‌వర్డ్‌లను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.
స్కామర్లు.. వినియోగదారులకు ఎర వేసి మభ్యపెడుతున్నారు. తెలియని నెంబర్ నుంచి లేదా మీ సన్నిహితుల కాంటాక్ట్ నుంచి మల్టీమీడియా ఇమేజ్ మెసేజ్ పంపిస్తారు. అయితే అది చూడటానికి ఫన్నీగా ఉంటుంది. అంతే కాకుండా డబ్బు గెలుచుకోండి అనే ఆకర్షణీయమైన ఆఫర్ లేదా క్లిక్ చేయండి అనేవి కూడా కనిపిస్తుంటాయి.
వచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయగానే.. అందులో దాగున్న మాల్‌వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్‌లో సైలెంట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఇలా ఇన్‌స్టాల్ అయిన వెంటనే.. మోసగాళ్లు మీ ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ యాప్స్ వంటి వాటిని హ్యాక్ చేయగలరు. అంటే వారికి మీ ఫోన్ యాక్సెస్ లభిస్తుందన్నమాట. కొన్నిసారు ఫొటోలలోనే క్యూఆర్ కోడ్స్ దాగి ఉండవచ్చు, అవి మిమ్మల్ని.. ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు మళ్లించే అవకాశం ఉంది.
మాల్‌వేర్ లేదా స్పైవేర్ మీ మొబైల్ ఫోన్ కీబోర్డ్‌లో టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇందులో బ్యాంకింగ్ యాప్స్ పాస్‌వర్డ్‌లు, సోషల్ మీడియా లాగిన్ వివరాలు, ఇతరత్రా పిన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ వివరాలను మోసగాళ్లు చూస్తారు. ఆ తరువాత చేతివాటం చూపిస్తారు.
ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?
➤స్కామ్ పెరిగిపోతున్న సమయంలో.. తెలియనివారు పంపించే లింక్స్ లేదా ఫొటోస్ డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలి. చూడటానికి ఫన్నీ మీమ్స్ మాదిరిగా కనిపించినప్పటికీ.. వాటిని డౌన్‌లోడ్ చేస్తే బాధపడేలా చేస్తాయి.
➤తెలియని వారి నుంచి వచ్చే సందేశాలను ఓపెన్ చేయడానికి ముందు.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం.
➤గిఫ్ట్స్, డిస్కౌంట్స్ లేదా రివార్డ్స్ పేరుతో ఎవరైనా ఆకర్శించడానికి ప్రయత్నిస్తే.. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
➤మీరు ఉపయోగించే మొబైల్ ఫోనులోని యాప్స్‌ల యాక్సెస్‌ను కూడా పరిమితం చేసుకోవాలి.
➤వాట్సాప్, బ్యాంక్ అకౌంట్స్ వంటివి సురక్షితంగా ఉండాలంటే.. 'టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్'ను యాక్టివేట్ చేసుకోవాలి.
➤స్కామ్ మెసేజస్ చేసే నెంబర్లను బ్లాక్ చేసుకోవడం మంచిది. మాల్‌వేర్ ఉన్నట్లు తెలిస్తే.. ముఖ్యమైన సమాచారం / డేటాను బ్యాకప్ చేసి.. ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
స్కామ్ ద్వారా మోసపోయారని తెలిస్తే..
➤స్కామ్ ద్వారా మోసపోయామని తెలిస్తే.. మొబైల్ డేటాను డిస్‌కనెక్ట్ చేసి, యాంటీవైరస్ యాప్ ఉపయోగించి స్కాన్ చేసుకోవాలి.
➤ముఖ్యమైన యాప్స్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయాలి.
➤అనవసరమైన లేదా అనుమానిత యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
➤సైబర్ క్రైమ్ అధికారులను సంపాదించండి లేదా 1930కు కాల్ చేసి జరిగిన సమాచారం వివరించండి.