
రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయులకు తగ్గిపోతుండటం ఎగుమతులకు ప్రయోజనకరమే అయినప్పటికీ పరిశ్రమ వర్గాల్లో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దీనివల్ల విదేశీ మార్కెట్లలో మరింత మెరుగ్గా పోటీపడటానికి అవకాశం ఉన్నా.. ముడివస్తువుల రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రయోజనాలు అంతంతమాత్రంగానే ఉంటాయని దిగుమతి ఆధారిత పరిశ్రమలు చెబుతున్నాయి. రత్నాభరణాలు, పెట్రోలియం, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి.
రూపాయి బలహీనపడటం వల్ల మన ఉత్పత్తులను చౌకగా ఎగుమతులు చేస్తూ విదేశీ మార్కెట్లలో విస్తరించేందుకు వీలవుతుంది. కానీ, అదే సమయంలో దిగుమతుల వ్యయాలూ పెరిగిపోతాయి. దీనితో నిర్దిష్ట ముడివస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన ఎగుమతిదార్లకు మార్జిన్లు తగ్గిపోయి, పెద్దగా ప్రయోజనం ఉండదని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఎగుమతిదార్ల అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎగుమతిదార్లకు మద్దతుగా నిలుస్తాం..
అమెరికా టారిఫ్‌ల భారం వల్ల ప్రతికూల ప్రభావాలు పడకుండా ఎగుమతిదారులకు కావాల్సిన మద్దతునిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎగుమతిదార్లు ఉత్పత్తి నాణ్యత పెంచుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని, సరఫరా వ్యవస్థల్లో
మార్పులు..చేర్పులు చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు