
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్‌లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు.
నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్‌కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.
‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
భారత్ ముందు అవకాశాలు..
తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్‌ను డిమాండ్ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో భారత్ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్‌లు భారత్ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్‌కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్‌పై విధించే టారిఫ్‌లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్‌పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్‌లను (10 శాతం బేసిక్ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే.