
చౌక చమురు దిగుమతులతో లాభాల పంట
ప్రైవేటు రిఫైనరీలకే అత్యధిక ప్రయోజనం
రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీలకు వరం
వినియోగదారులకు దక్కని ఫలం... ప్రభుత్వ చమురు రిటైలర్లపై పరోక్ష సబ్సిడీల ప్రభావం
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్‌తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!!
రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్‌తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం!
మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే....
రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్‌కు చెందిన సీఆర్‌ఈఏ థింక్‌ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్‌ఆఏ పేర్కొంది.
ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్‌నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్‌ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్‌లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి.
ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం
భారత్‌కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.
ఎగుమతుల్లో రిలయన్స్ టాప్
ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్‌దే. రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ జూన్‌లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్‌జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
పరోక్ష సబ్సీడీలతో పీఎస్‌యూల లాభాలకు గండి
ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది.
అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్‌పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్‌తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్