Sakshi News home page

Startups: అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?

Published Fri, Jan 19 2024 12:18 PM

DPIIT Rankings 2024 For Startup Companies In India - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. 

యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. 

భారత్‌లో దాదాపు 110 యూనికార్న్‌ కంపెనీలు..

ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్‌ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు..

స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన  డిపార్ట్‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్​ పర్ఫార్మర్స్, టాప్​ పర్ఫార్మర్స్, లీడర్స్​, ఆస్పైరింగ్​ లీడర్స్​, ఎమర్జింజ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు.

‘లీడర్స్‌’ కేటగిరీలో ఏపీ టాప్‌..

దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్​' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు  బెస్ట్‌ పర్‌ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్​ స్టేట్‌​గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్  మేఘాలయలు టాప్​ పర్ఫార్మర్స్‌గా ఎంపికయ్యాయి. 

బిహార్, హరియాణా, అండమాన్  నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్‌ లీడర్స్‌ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా  నగర్ హవేలీ, డామన్  డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి.

ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల!

వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు..

ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్‌‌ యాక్సెస్, ఇంక్యుబేషన్  ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌‌లు పేటెంట్లు, ట్రేడ్‌‌మార్క్‌‌ల వంటి ఇంటెలెక్చువల్ ​ప్రాపర్టీ రైట్స్​ (ఐపీఆర్‌‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement