రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు

May 20 2025 12:37 AM | Updated on May 20 2025 12:37 AM

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు

● జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి ● 25వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వ ఆమోదం

బాపట్ల: రైతులకు మద్దతు ధర కల్పించడంలో భాగంగా 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఆమోదించిందని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి చెప్పారు. జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. వర్చువల్‌ విధానం ద్వారా డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 29 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. బయట మార్కెట్లో ధాన్యం ధరలు తగ్గడం, అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచేలా అనుమతులు ఇవ్వాలని పలుమార్లు కోరినట్లు చెప్పారు. స్పందించిన ప్రభుత్వం తాజాగా 25వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు ఇచ్చిందన్నారు. ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బంగారు కుటుంబాలను గుర్తించాలి

పీ–4 విధానంలో బంగారు కుటుంబాలు మార్గదర్శిలను అనుసంధానించే ప్రక్రియ చేపట్టాలని ఎంపీడీవోలను కలెక్టర్‌ ఆదేశించారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శిలు అందించే సహాయం ఎలా చేరవేయాలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి తీరువా లక్ష్యం మేరకు వసూలు చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం కింద పట్టణాలలో 2,500 యూనిట్లను స్థాపించాలని మున్సిపల్‌ కమిషనర్లకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సూర్యఘర్‌ యూనిట్ల స్థాపన ప్రతి ఎంపీడీవోకి 1500 యూనిట్లను లక్ష్యంగా ఇచ్చామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వాహనాలకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగంగా జరిగేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు వేగంగా పూర్తయ్యేందుకు పొజిషన్‌ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. సమావేశంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్‌,వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21వ తేదీన బాపట్ల కలెక్టరేట్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాపట్ల కలెక్టర్‌ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు వెయ్యి మందితో యోగ ఆసనాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు. యోగా దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని, ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజులపాటు ఈ కార్యక్రమాలను అన్ని ప్రాంతాలలో నిర్వహించాలన్నారు. యోగా ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు పోటీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విజేతలకు బహుమతులిచ్చి కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌ గౌడ్‌, డీఈవో పురుషోత్తం, డీఆర్‌డీఏ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నాటు సారా తయారీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నాటు సారా తయారీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులకు తెలిపారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో లైన్‌ డిపార్టుమెంటు అధికారులతో కలెక్టర్‌ సోమవారం సమావేశం నిర్వహించారు. నాటు సారా నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని తలపెట్టిందని అన్నారు. జిల్లాలో నాటు సారా నిర్మూలనపై పొబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారులను ఆయన ఆరా తీశారు. నవోదయం 2.0 అమలుపై తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ కు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు వివరించారు. రాబోవు 15 రోజులలో జిల్లాలో నాటు సారా తయారు చేసే సమస్యాత్మకమైన 16 గ్రామాలలో దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల రెవెన్యూ డివిజన్‌ అధికారి గ్లోరియ, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నారాయణ భట్టు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement