
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీరెడ్డి గాని పల్లెకు చెందిన వీరభద్ర కుమారుడు వి.చంద్రశేఖర(42) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పలమనేరుకు చెందిన మహిళతో వివాహం కాగా, కొంత కాలం క్రితం ఆమె చంద్రశేఖర్‌ను వదిలి వెళ్లిపోయింది. అనంతరం రమాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి దీక్షిత(9) చైతన్యకుమార్(5) సంతానం ఉన్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర మద్యానికి బానిసై, పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం ఏర్పడి తీవ్ర గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన విషయం బయటకు తెలియలేదు. అయితే గురువారం రాత్రి చంద్రశేఖర ఇంట్లోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య రమాదేవిని విచారణ చేస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, ఎప్పుడు చనిపోయాడు తనకు తెలియదంటూ సమాధానం దాటవేసింది. అంతేకాకుండా మృతుడి శరీరం, తలపై రక్త గాయాలు ఉండడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలుకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర మృతిపై భార్య రమాదేవిని పోలీసులు ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చంద్రశేఖర తమ్ముడు మహేష్ కుమార్ మాట్లాడుతూ... తన సోదరుడు మృతికి రమాదేవి కారణమని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
రెండో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడి

భవన నిర్మాణ కార్మికుడి హత్య