
హోటళ్లలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుచి, శుభ్రత, లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఖాదరబాద్‌లోని మహ్మద్ బిర్యాని సెంటర్, డీ మార్ట్ ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహా బిర్యాని సెంటర్, సాగర్ రెస్టారెంట్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్, సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడ సెంటర్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. చికెన్ పకోడ తయారు చేస్తున్న వారు వినియోగించే ఆయిల్ బాగలేదని గమనించామన్నారు. కొందరికి నోటీసులు జారీ చేశామని, తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. టీపీసీ మీటర్‌తో ఆయిల్‌ను చెక్ చేశామన్నారు. మహ్మద్ బిర్యాని సెంటర్ నుంచి మటన్ బిర్యాని, చికెన్ కర్రీ ఐటమ్స్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లోని కొన్ని పదార్థాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్‌లో ఏమైనా రిమార్క్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నడపకూడదన్నారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకుని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. ఆమె వెంట కొత్తపల్లె, గోపవరం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామమోహన్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.