
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళన
రాయచోటి టౌన్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీవోను అమలు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్లు డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి పట్టణం ఎన్‌జీవో కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎదుట తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ పని గంటలు పెంచారు కానీ వేతనాలు మాత్రం రూ.15 వేలు ఇస్తున్నారన్నారు. కార్మికులతో సమానంగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి 62 ఏళ్లకు పెంచి అప్కాస్ కొనసాగించాలన్నారు. 6 ఏళ్లకు వయో పరిమితి పెంచకపోతే పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయకపోవడానికి కార్మికుల్ని దగా చేయడమేనన్నారు. అనంతరం కార్యదర్శి శంకరయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అలాగే అప్కాస్ కొనసాగించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, ఇంజినీరింగ్ కార్మికులు చెన్నయ్య, రాంబాబు, దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు.