
తాడేపల్లి : అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎస్టీ, ఎస్సీ కమిషన్లకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది మోహన్‌కుమార్‌లపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘బాధితులు ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారు. వారందరినీ ఎమ్మెల్యే బుడ్డా కులదూషణ చేశారు. వారిపై దారుణంగా దాడి చేశారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించి రాత్రంతా తిప్పారు ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డానే స్వయంగా కారు నడిపారు. అనంతరం వారిని ఒక గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు.
అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడమే. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 1989 కింద నేరం. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల గౌరవంపై తీవ్రమైన దాడి చేసినట్టే. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బుడ్డా పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి.