
అన్నమయ్య జిల్లా కలకడ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వలంటీర్లు
కలకడ: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను గడపగడపకూ చేరుస్తున్న తమను వేగులుగా చిత్రీకరించడం సిగ్గుచేటని, తక్షణమే ఇటువంటి పిచ్చిరాతలు మానుకోవాలని పలువురు వలంటీర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈనాడు’లో వచ్చిన అసత్య కథనాలను ఖండిస్తూ అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని వలంటీర్లు శనివారం నిరసన తెలిపారు.
కలకడ ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలంలోని అన్ని గ్రామాల వలంటీర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘రామోజీరావ్ డౌన్ డౌన్.. ఈనాడులో తప్పుడు రాతలు మానుకోవాలి...’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అర్హులకు అన్ని పథకాలు అందేలా చూస్తున్న తమపై తప్పుడు రాతలు రాయడం దుర్మార్గమన్నారు.
రాజకీయ కోణంలో వలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో అపోహలు సృష్టించేలా కథనాలు ప్రచురించడం మంచిపద్ధతి కాదన్నారు. మరోసారి ఇటువంటి అసత్య కథనాలు ప్రచురిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.