విధులు పక్కాగా.. | Teaching hospitals to make reforms Better medical care for poor patients | Sakshi
Sakshi News home page

విధులు పక్కాగా..

Oct 10 2021 4:08 AM | Updated on Oct 10 2021 4:08 AM

Teaching hospitals to make reforms Better medical care for poor patients - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర వైద్యవిద్యా శాఖ సంస్కరణలు చేపడుతోంది. ప్రధానంగా సిబ్బంది, డాక్టర్ల విధుల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది. నిజానికి.. స్పెషలిస్టు సేవల కోసం రోజూ వేలాది మంది రోగులు బోధనాసుపత్రులకు వస్తుంటారు. కానీ, చాలామంది డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదు. వచ్చినా రెండు మూడు గంటలు పనిచేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. దీనిపై ఎప్పటినుంచో అనేక ఫిర్యాదులున్నాయి. ఇలా కొద్దిమంది వైద్యులవల్ల చాలామందికి చెడ్డపేరు వస్తోంది. అంతేకాదు.. డాక్టరు కోసం వచ్చిన పేషెంటు గంటల తరబడి నిరీక్షించి ఉసూరుమంటూ వెళ్లిపోతుండడం కూడా డీఎంఈ దృష్టికి వచ్చింది. ఓ వైపు మౌలిక వసతుల కోసం ప్రభుత్వం వేలాది కోట్లు వ్యయంచేస్తూ ఉద్యోగాల ఖాళీలన్నీ యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తుంటే మరోవైపు వైద్యులు విధులకు సరిగ్గా రాకపోతే చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని సర్కారు భావిస్తోంది. 

ఎనిమిది గంటలు ఆస్పత్రిలోనే..
నిజానికి.. నిబంధనల ప్రకారం ప్రతీ డాక్టరు ఉ.9 గంటలకు ఆస్పత్రికి వస్తే.. సా. 4 గంటల వరకూ పనిచేయాలి. మధ్యలో భోజనానికి ఇంటికి వెళ్తుంటారు. కానీ..
► ఇకపై ఒకసారి ఆస్పత్రి లేదా మెడికల్‌ కాలేజీలోకి వచ్చిన తర్వాత తిరిగి బయటకు వెళ్లాలంటే ప్రిన్సిపల్‌ లేదా సూపరింటెండెంట్‌ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి స్లిప్‌ సెక్యూరిటీకి చూపించాల్సిందే. 
► ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వాహనం నెంబరు, పేరు నమోదు చేసుకుంటారు. 
► తిరిగి వచ్చిన తర్వాత కూడా సమయం నమోదు చేస్తారు. 
► ఇలా విధుల్లో ఉన్న సమయంలో అత్యవసరమైతేనే ఆయా విభాగాధిపతులు అనుమతిస్తారు. అనుమతికి గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. 
► అంతేకాక.. ఆస్పత్రి ఆవరణంలో ఇకపై అన్నిచోట్లా సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. 

రోగులు ఫిర్యాదు చెయ్యొచ్చు
ఎవరైనా డాక్టరు విధుల్లో ఉన్న సమయంలో సేవలకు రాకపోతే రోగులు సంబంధిత సూపరింటెండెంట్‌ లేదా సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ఆ ఫిర్యాదులను పరిశీలించి సదరు డాక్టరుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఎవరైనా డాక్టరు లేదా కిందిస్థాయి సిబ్బంది డబ్బులడిగినా, దురుసుగా ప్రవర్తించినా సంబంధిత అధికారికిగానీ, స్పందన కార్యక్రమంలో గానీ ఫిర్యాదు చెయ్యొచ్చు. అంతేకాదు.. సెలవు పెట్టకుండా విధుల్లో ఉన్నట్లు చూపించి, సొంత క్లినిక్‌లోగానీ, నర్సింగ్‌ హోంలో గానీ పనిచేస్తుంటే వెంటనే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. 

మెరుగైన వైద్యసేవలు అందించేందుకే..
పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను తూ.చ తప్పకుండా పాటిస్తాం. రోగులకు ఇబ్బం ది కలగకుండా చూడాలన్నదే మా ఉద్దేశ్యం. విధుల్లో ఉన్న సమయంలో విధిగా ఆస్పత్రిలోనే డాక్టరు, ఇతర సిబ్బంది ఉండాల్సిందే.
– డా. ఎం. రాఘవేంద్రరావు, డీఎంఈ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement