
కొండూరుపాళెం వద్ద సముద్రం తీరానికి వచ్చి వేట సాగిస్తున్న తమిళ జాలర్ల స్పీడు బోటు
హద్దులు దాటి సంపదను దోచుకుపోతున్న తమిళ జాలర్లు
పొరుగు రాష్టంతో సమస్యగా మారిన వేట
నష్టపోతున్న తిరుపతి జిల్లా మత్స్యకారులు
ఇరవై ఏళ్లుగా ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల మధ్య సముద్రంపై వేట పెద్ద సమస్యగా మారింది. తరచూ ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదుర్చినా తమిళ జాలర్లు వాటిని లెక్కచేయక హద్దులు దాటి తిరుపతి జిల్లా తీరంలో వేట సాగిస్తున్నారు. దీంతో జిల్లా మత్య్సకారులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తూ మత్స్య సంపదను పొరుగు రాష్ట్రం జాలర్లు కొల్లగొడుతున్నారు.
వాకాడు : ఆంధ్రా సరిహద్దుల్లో తమిళ జాలర్లు వేట చేయకూడదని రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగినా హద్దులు దాటి మత్స్య సంపదను తమిళ జాలర్లు దోచుకుపోతున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలలుగా తిరుపతి జిల్లా తీరం వెంట తమిళ జాలర్లు తమ స్పీడ్ బోట్లతో నిబంధనలకు విరుద్ధంగా సముద్రంపై జల్లెడ పట్టి సముద్రంలోని మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. దీంతో జిల్లాలోని 5 తీర ప్రాంత మండలాల మత్స్యకారులు విలవిలలాడుతున్నారు.
స్పీడ్ బోట్లతో..
ఏటా జిల్లా మత్స్యకారులకు దక్కాల్సిన సుమారు 15 వేల టన్నుల మత్స్యసంపదను పొరుగు రాష్ట్రాల జాలర్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పెద్ద బోట్లు 250 హెచ్‌పీ నుంచి 500 హెచ్‌పీ మెకనైజ్డ్ బోట్లతో ఎంఎఫ్‌ఆర్‌ఐ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రా జలాలపై తీర ప్రాంతం దగ్గరగా వేట చేయడమే కాకుండా స్థానిక మత్స్యకారులపై దాడులు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కరైకల్, కడలూరు, నాగపట్నం, పాండిచ్చేరి జిల్లాలకు చెందిన 5 స్పీడు బోట్లు వివరాలను ఆయా మత్స్యశాఖ ఉన్నత స్థాయి అధికారులకు మన జిల్లా అధికారులు తెలియజేసి వారిపై చర్యలు తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వేట
సాధారణంగా సముద్రంపై వేట చేసే మత్స్యకారులు 4 అంగులాల పైన రంధ్రాలు కలిగిన వలలను మాత్రమే వేటకు ఉపయోగించాలి. అలా కాకుండా తమిళ జాలర్లు నిబంధనలకు విరుద్దంగా ఒక ఇంచి సైజు రంధ్రాలతో తయారు చేసిన 100 మీటర్ల వలలతో వేట చేయడంతో చిన్న చిన్న నలక చేపలతో పాటు పెద్ద చేపలు సైతం వలలో చిక్కుకుని జిల్లా మత్స్య సంపద పొరుగు రాష్టాలకు తరలిపోతోంది. వాస్తవానికి స్పీడు బోట్ల జాలర్లు సముద్రంపై అలలు లేని ప్రదేశంలో అంటే 8 నాటికల్ మైళ్ల దూరం పైన వేట సాగించాలి. అయితే అధికార నిబంధనలను భేఖాతరు చేసి 3 నాటికల్ మైళ్ల దూరంలో ఎగసిపడుతున్న అలలు సైతం లెక్క చేయకుండా వేట చేసి మత్స్య సంపదను దోచుకుపోవడంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు.
రెండు నెలలుగా జీవన భృతి లేక
తిరుపతి జిల్లాలో 79 కిలో మీటర్ల సముద్ర తీరం విస్తరించి ఉంది. 5 తీర ప్రాంత మండలాల్లో 38 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అందులో దాదాపు 9 వేల మంది మత్స్యకారులు, 1200 వరకు ఇంజిన్ బోట్లు ఉన్నాయి. రెండు నెలలుగా పొరుగు రాష్ట్రాల జాలర్ల దెబ్బకు స్థానిక మత్స్యకారులు విలవిల్లాడుతున్నారు. చేపల వేటే జీవనాధారంగా జీవించే మత్స్యకారులు రెండు నెలలుగా జీవన భృతిని కోల్పోయారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, వంకలు, నదులపై ప్రవహించి వరద సముద్రంలో కలిసింది. ఆ మేరకు మత్స్య సంపద పుష్కలంగా దొరుకుతున్న సమయంలో తమిళనాడు, కడూరు, నాగూరు నాగపట్నం, తూత్‌కుడి, తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు స్పీడు బోట్లుతో మత్స్య సంపదను దోచుకుపోతున్నారు.
చర్చలు జరిగినా ఫలితం లేదు
పొరుగు రాష్ట్రాలకు చెందిన జాలర్లు స్పాడు బోట్లుతో తమ పరిధిలో అక్రమంగా వేట చేయడమే కాకుండా తమపై దాడులు చేసి గాయపరుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిగినా ఫలితం కనిపించలేదు. ఇకనైనా పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్లు దాడుల నుంచి స్థానిక మత్స్యకారులను కాపాడాలి. – పోలయ్య మత్స్యకారుడు, కొండూరుపాళెం
అధికారులు చొరవ చూపాలి
నిబంధనలను ఉల్లంఘించి తమిళ జాలర్లు మత్స్యసంపదను దోచుకుపోతున్నారు. దీంతో తాము రోజంతా వేట చేసినా ఒక్క చేప దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోంది. అధికారులు చొరవ చూపాలి. లేకపోతే జిల్లా మత్స్యకారులకు జీవన భృతి లేకుండా పోతుంది. – మునిస్వామి, మత్స్యకారుడు, ఓడపాళెం