‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు 

Nannaya Varsity Completes 16 years - Sakshi

రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి శుక్రవారానికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల వాంఛ మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట దీనిని ఏర్పాటు చేసేందుకు ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి. ఎట్టకేలకు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని 22–6–2016న వెలసిన ఈ యూనివర్సిటీ స్వశక్తితో అచిరకాలంలోనే అభివృద్ధిని సాధిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటోంది.  

కరోనా ప్రభావాన్ని అధిగమిస్తూ ... 
రెండున్నరేళ్లుగా కరోనా వైరస్‌ ప్రభావం సమాజాన్ని ఏవిధంగా ప్రభావితం చేసినా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ దానిని కూడా ఒక అవకాశంగా మార్చుకోగలిగింది. 2020 మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతవేయవలసి రావడంతో విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ తరుణంలో విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు ఆదేశాలను అనుసరించి ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు వివిధ అంశాలపై నిష్టాతులతో వెబినార్లు నిర్వహించారు.

ఈ వెబినార్ల నిర్వహణలో దేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రీతిలో వంద మార్కును దాటేయడంతో ఒకేసారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులోను చోటు దక్కించుకోగలిగింది. జనావళికి కరోనా వైరస్‌ నుంచి ఎదురవుతున్న భయాందోళనను తొలగిస్తూ, ఆత్మస్థైర్యాన్ని అందించే విధంగా సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ సేవలను కూడా ‘నన్నయ’ వర్సిటీ సైకాలజీ విభాగం అధ్యాపకులు అందించారు.  

11 వేల పుస్తకాలతో ‘నన్నయ’ విజ్ఞాన భారతి  
క్యాంపస్‌లోని సెంట్రల్‌ లైబ్రరీలో దాతలు అందించిన 11 వేల పుస్తకాలతో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ‘నన్నయ’ భారతిని ప్రారంభించారు. జె.స్టోర్, జె.గేట్‌ సేవలను కొనుగోలు చేసి విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సైన్స్‌ జర్నల్‌ని కూడా ‘నన్నయ’ విజ్ఞాన భారతిలో అందుబాటులోకి తెచ్చారు.  

‘నాక్‌’ గుర్తింపును సాధిస్తాం  
‘నాక్‌’ గుర్తింపును సాధిస్తాం. ఇందుకు అవసరమైన కసరత్తు వేగంగా జరుగుతోంది. ఎస్‌ఎస్‌ఆర్‌ కూడా సమర్పించాం. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే ఐఎస్‌ఓ, ఏఐసీటీఈ గుర్తింపులు సాధించాం. ‘ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ పోర్టల్‌ ద్వారా అంతర్జాతీయంగా విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. 
– ఆచార్య ఎం.జగన్నాథరావు, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top