
వేధిస్తున్న బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్
మహిళల కంటే పురుషుల్లో రెట్టింపు మరణాలు
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి
ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? - సాక్షి, అమరావతి
టకోట్సుబో కార్డియో మయోపతి..
బ్రోకెన్ హార్ట్ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ జర్నల్‌ను ప్రచురించింది.
1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం
2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు.
ఆ వయస్కులవారికే అధికం
సాధారణంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవత్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య 2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూడిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు.
సమస్య తలెత్తితే..
బ్రోకెన్ హార్ట్ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.
భావోద్వేగ మద్దతు అవసరం
కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు