కరువుతీరేలా ఎరువులు

Markfed advance strategy for Fertilizer shortage in Kharif - Sakshi

మార్క్‌ఫెడ్‌ ముందస్తు వ్యూహం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. సాగు విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని«విధంగా ఆర్బీకేలు, సొసైటీలు ఎరువుల విక్రయాలను చేపడుతున్నాయి. సీజను ప్రారంభానికి ముందే రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను అందుబాటులోకి తెస్తున్నారు.

లక్ష్యానికి మించి నిల్వలు..
ఖరీఫ్‌లో దాదాపు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్క్‌ఫెడ్‌ ప్రతి నెలా కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలు చేసి ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తోంది. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో కనీసం 1.50 లక్షల టన్నులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మార్క్‌ఫెడ్‌ ప్రభుత్వ లక్ష్యానికి మించి 1.77 లక్షల టన్నులను నిల్వ చేసింది. ఎరువుల రవాణాలో జాప్యం జరిగినా, కొరత ఏర్పడినా ఈ బఫర్‌ స్టాక్‌ను వినియోగించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో 1,52,449 టన్నులు నిల్వ ఉండగా సహæకార సంఘాల గోదాముల్లో 25 వేల టన్నులు నిల్వ ఉన్నాయి.

గత సర్కారు హయాంలో ధర్నాలు
గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు పలుదఫాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధిక ధరలు, ఎరువుల కొరత సమస్యలతో సతమతమయ్యారు. ఈ బాధల నుంచి రైతన్నలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సహకార సంఘాల్లోనూ ఎరువుల విక్రయాలను కొనసాగిస్తోంది.

ఇప్పటికే పది వేల టన్నులు కొనుగోలు
ఇప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న 577 సహకార సంఘాల్లో 25 వేల టన్నులు, 4,166 రైతు భరోసా కేంద్రాల్లో 68 వేల టన్నులు, మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో 84 వేల టన్నుల ఎరువులను నిల్వ చేశారు. ప్రైవేట్‌ మార్కెట్‌ కంటే ఆర్బీకేలు, సంఘాల్లో ఎరువుల ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటికే 10 వేల టన్నులను 
కొనుగోలు చేశారు. 

ఎరువుల కొరత రానివ్వం..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఖరీఫ్‌లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు వ్యూహంతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు విక్రయించేందుకు వీలుగా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అధికంగా సిద్ధం చేస్తున్నాం. కనీసం 1.50 లక్షల బఫర్‌ స్టాక్‌ ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతకు మించి నిల్వలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,950 సహకార సంఘాలకుగానూ ఆర్ధికంగా, క్రియాశీలకంగా ఉన్న 577 సంఘాలను తొలి విడత ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేశాం. మిగిలిన సంఘాల పరిస్థితిని సమీక్షించి విక్రయాలను చేపడతాం.
– ఎం.ఎస్‌. ప్రద్యుమ్న, మార్క్‌ఫెడ్‌ ఎండీ 

తప్పిన ఇబ్బందులు
గ్రామస్థాయిలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యయ ప్రయాసలు తొలగాయి. గతంలో వ్యవసాయ పనులు మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతుకు సమయం ఆదా అవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top