మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు | Aqua farming in salt water ponds is a new employment for farmers | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు

Jun 18 2023 4:26 AM | Updated on Jun 18 2023 8:16 PM

Aqua farming in salt water ponds is a new employment for farmers - Sakshi

సాక్షి, అమరావతి: సాలికోర్నియా.. సముద్ర తీరం వెంబడి ఉప్పునీటి ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే ఈ మొక్కలను సంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నా­రు. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని విమానాల్లో సైతం ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పును తట్టుకుని పుషి్పంచే మొక్కల జాతికి చెందిన సాలికోర్నియా మొక్కల్లో 50 శాతం వరకు సోడియం క్లోరైడ్‌ నిండి ఉంటుంది. ఇందులోని లవణీయత సంప్రదాయ సముద్ర ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. వీటి నుంచి తీసే ఉప్పును హెర్బల్‌ సాల్ట్, గ్రీన్‌ సాల్ట్‌గా పిలుస్తున్నారు.  

ప్రొటీన్లు.. విటమిన్లూ ఉన్నాయ్‌ 
సాలికోర్నియా మొక్కల్లో 11 శాతం ప్రొటీన్లు, 20 శాతం ఫైబర్, జింక్, పొటాషియం, ఏ, బీ–1, బీ–12, బీ–15, సీ, ఈ విటమిన్లు అపారంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు. రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్‌ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గ్రీన్‌ సాల్ట్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు  చాలా దేశాల్లో ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసే ఉప్పును అన్ని వంటకాల్లో వాడుతున్నారు.

సీఎస్‌ఎంసీఆర్‌ఐ సాంకేతిక సహకారం 
గుజరాత్‌ భావనగర్‌లోని సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) సాలికోర్నియా మొక్కల నుంచి ఉప్పు తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ప్రత్యామ్నాయ ఉప్పు తయారీకి సంబంధించిన అన్ని శాస్త్రీయ, సాంకేతిక సహాయాలను అందిస్తోంది.

సాలికోర్నియా మొక్కల సాగు, కోత, మొక్కల్ని ఎండబెట్టడం, ఇతర ప్రక్రియల ద్వారా ఎకరాకు టన్ను ఉప్పు వస్తుందని సీఎస్‌ఎంసీఆర్‌ఐ చెబుతోంది. రూ.15 వేల పెట్టుబడితో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని సౌదీ దేశాలలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయట.

ఏపీలోనూ సాగుకు అవకాశాలు 
రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పెద్దఎత్తున విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తీరం వెంబడి రిజర్వ్‌ మడ అడవుల్లో సాలికోర్నియా మొక్కలు విస్తారంగా ఉన్నట్టుగా గుర్తించారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఈ మొక్కల జాడను సీఎస్‌ఎంసీఆర్‌ఐ గుర్తించింది. ఉప్పునీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా సాలికోర్నియా మొక్కల సాగు నిలుస్తుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇండోర్‌లో కూడా సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే ఈ మొక్కల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement