
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వరుసగా మూడేళ్లలో 750, 750, 1,050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వైద్య విద్యా రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఏకంగా 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలల్లో అడ్మిషన్‌లు ప్రారంభం కానున్నాయి. 2024–25లో మరో ఐదు కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శర వేగంగా డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కాలేజ్
వైఎస్సార్ జిల్లాలోని పులివెందులలో 51 ఎకరాల విస్తీర్ణంలో సీఎం జగన్ ప్రభుత్వం నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం డిసెంబర్ 2023 నాటికి నిర్మాణం పూర్తి కానుంది. 2024 అకడమిక్ ఇయర్ నుండి క్లాసులు ప్రారంభం అయ్యి పూర్తి స్థాయిలో అన్ని ఆసుపత్రి సేవలు మొదలుకానున్నాయి.